Published: 06-02-2019

ఎయిడ్స్‌ రోగుల పింఛన్‌కు రూ.100 కోట్లు

 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చింది. గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే తాజా పద్దులో కేటాయింపులను 20% పెంచారు. ప్రస్తుత బడ్జెట్‌లో ఆరోగ్య శాఖకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రూ.10,032 కోట్లు కేటాయించారు. మందుల కొనుగోలుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రూ.102 కోట్లు అదనంగా కేటాయించింది. గత ఏడాది మందులు, డ్రగ్స్‌ కోనుగోలుకు రూ.300 కోట్లు కేటాయించగా..
 
తాజా బడ్జెట్‌లో రూ.402 కోట్లు ప్రతిపాదించింది. దీంతో ఏ రకమైన ఔషధానికీ రోగులు ఇబ్బంది పడకూడదనేది ప్రభుత్వ ఆలోచన. ఆరోగ్య సేవలకు రూ.332 కోట్లు, జల కాలుష్యం తగ్గించేందుకు రూ.63 లక్షలు కేటాయించింది. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకానికి రాష్ట్ర వాటాలో పెద్దపీట వేసింది. స్త్రీలు గర్భందాల్చిన నాటి నుంచి ప్రసవం వరకు ప్రభుత్వం ఈ పథకం కింద సుమారు రూ.6 వేల వరకు నగదు సాయం అందిస్తుంది. ఈ పథకానికి గత ఏడాది రూ.161 కోట్లు కేటాయించిన ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రూ.224.10 కోట్లు కేటాయించింది.
 
రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్స్‌ రోగులకు మరింత భరోసా కల్పించింది. ప్రస్తుతం ఎయిడ్స్‌ రోగులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రతి నెలా రూ.1000 పెన్షన్‌ ద్వారా అందిస్తున్నారు. ఈ మొత్తంలో వారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. పెన్షన్‌ను మరింత మంది ఎయిడ్స్‌ రోగులను అదుకునేందుకు బడ్జెట్‌లో అధిక మొత్తంలో కేటాయింపులు చేసింది. గత ఏడాది ఎయిడ్స్‌ రోగుల పెన్షన్‌ కోసం ప్రభుత్వం రూ.33 కోట్లు కేటాయించింది. ఈసారి బడ్జెట్‌లో దాదాపు మూడు రేట్లు పెంచిన రూ.100 కోట్లు కేటాయించింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 163.67% కేటాయించింది.