Published: 26-01-2019

రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గణతంత్ర శుభాకాంక్షలు

‘‘ఎందరో మహనీయుల కృషి, పోరాటాల ఫలితంగానే భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యంగా అవతరించింది’’ అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, శుక్రవారం రాత్రి ఆయన సందేశానిచ్చారు. ‘ఏపీ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించాక జరుపుకుంటున్న ఐదవ గణతంత్ర వేడుక ఇది. ఈ ఏడాది మరో ప్రత్యేక కూడా ఉంది. 17వ లోక్‌సభకు జరగనున్న ఎన్నికలు జాతి భవితను నిర్ధేశించే ఎన్నికలు కానున్నాయి.
 
అయితే ప్రజల ఆశలు, లక్ష్యాలకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తూట్లు పొడిచిన నేపథ్యంలో అందరి ఆకాంక్షలు నెరవేర్చే వారికే పట్టం కట్టాల్సిన కీలక బాధ్యతను ఈ గణతంత్రం ప్రజల ముందు ఉంచిందని’ సీఎం అభిప్రాయపడ్డారు. ‘ప్రజాస్వామ్యానికి ఎప్పటికప్పుడు పెనుసవాళ్లు ఎదురవుతున్నా, దేశ ప్రజలు వాటిని ఎంతో సంయమనంతో, సమిష్టి భావనతో ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ప్రజాస్వామానికి మరో రూపంలో ప్రమాదం ఎదురైంది. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సమాఖ్య భావన కన్పించకుండా పోతోందని’ చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
 
రాష్ట్రం ఆరంభ ఆటంకాలను అధిగమించి అభివృద్ధి బాటలో పయనిస్తోంది. ఇటు అమరావతి నగర నిర్మాణం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. మరో పక్క పోలవరం ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేసుకుంటున్నాం. ఆగ్నేయాసియాకు ముఖ ద్వారంగా మలిచే క్రమంలో ‘సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌’గా బ్రాండింగ్‌ చేసుకోగలిగాం. అమరావతి గురించి ఇప్పుడు ప్రపంచంలో చర్చ మొదలైంది. దేశం గర్వించే నగరంగా కొత్త రాజధానిని నిర్మించుకుంటున్నాం. మంత్రి లోకేశ్‌ బృందం పర్యటనలో పారిశ్రామిక, వాణిజ్య దిగ్గజాలు ఏపీ వైపు చూసేలా చేయగలగడంలో విజయం సాధించడం ఈ గణతంత్ర దినోత్సవాన ఒక శుభసూచకమని’ అభివర్ణించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి దేశ అత్యున్నత ‘భారతరత్న’ పురస్కారం లభించడం సముచితమని సీఎం చంద్రబాబు చెప్పారు.
 
అలాగే నానాజీ దేశ్‌ముఖ్‌, భూపెన్‌ హజారికాలకు మరణానంతరం భారత రత్న పురస్కారాలు దక్కడం సంతోషకమన్నారు. ఇద్దరు తెలుగు ప్రముఖులు సినీగీత రచయిత సిరివెన్నల సీతారామశాస్త్రి, చెస్‌ క్రీడాకారిణి ద్రోణవల్లి హారికలకు పద్మ పురస్కారాలు దక్కడం అభినందనీయమన్నారు. ఎన్ని పర్యాయాలు, ఎన్ని అభ్యర్థనలు చేసినా స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించడంలో కేంద్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.