Published: 16-01-2019

తెలుగు రాష్ట్రాల పరిధిలో ఐదు రైళ్లకు వర్తింపు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో విడతల వారీగా ఫ్లెక్సీ ఫెయిర్‌ విధానాన్ని రద్దు చేయనున్నారు. 2016 సెప్టెంబరు 9న అమల్లోకి వచ్చిన ఈ విధానంలో ప్రయాణానికి 120 రోజుల ముందే టికెట్‌ను సాధారణ ధరపై బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. మొత్తం బెర్తుల్లో 10 శాతానికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జరిగే ప్రతి పది శాతం బెర్తుల బుకింగ్‌కు టికెట్‌ ధరపై 10% అదనంగా వసూలు చేస్తారు. ఈ అదనపు బాదుడు గరిష్ఠంగా అసలు ధరకంటే 50% దాకా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ విధానం ద్వారా భారతీయ రైల్వేకు రూ. 540 కోట్ల మేర లాభం వచ్చినా.. దాదాపు 47 రైళ్లలో మాత్రం ఆక్యుపెన్సీ రేటు పడిపోతూ వచ్చింది.
 
ఇందుకు కారణం.. 1.5 రెట్ల అధిక ధర చెల్లించి రైళ్లో ప్రయాణించడం కంటే.. ఆ మొత్తం ధర కంటే తక్కువ ఖర్చులో విమానాల్లో వెళ్లే అవకాశాలుండటమే. దీంతో.. విడతల వారీగా ఈ రైళ్లలో ఫ్లెక్సీఫెయిర్‌ను రద్దుచేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఇందులో భాగంగానే.. దక్షిణ మధ్య రెల్వే పరిధిలోని సికింద్రాబాద్‌-పునె(శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌), యశ్వంతపూర్‌-ఢిల్లీ(దురంతో), ఢిల్లీ-యశ్వంతపూర్‌(దురంతో), లోకమాన్యతిలక్‌-సికింద్రాబాద్‌(దురంతో), సికింద్రాబాద్‌-నిజాముద్దీన్‌(రాజధాని) ఎక్స్‌ప్రెస్ లలో ఫిబ్రవరి, మార్చి, ఆగస్టు నెలల్లో విడతలవారీగా ఫ్లెక్సిఫెయిర్‌ను రద్దు చేస్తారు.