Published: 16-01-2019
ప్రతి కుటుంబానికి ‘ఫుడ్ బాస్కెట్’

రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఫుడ్ బాస్కెట్’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.ఎ్‌స.రావత్ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. గిరిజన ప్రాంతాల్లో మహిళలు, పిల్లల్లో నెలకొన్న పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్నారు. అన్న అమృతహస్తం, గిరి గోరుముద్దలు, బాలామృతం వంటి పథకాలను గిరిజన ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. అయినా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ప్రభుత్వం ‘ఫుడ్ బాస్కెట్’ ద్వారా ప్రతి నెలా రెండు కిలోల రాగి పిండి, కందిపప్పు, లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్, కిలో వేరుశనగ, కిలో ఉప్పు, కిలో బెల్లం అందించాలని నిర్ణయించింది.
సుమారు 2 లక్షల గిరిజన కుటుంబాలకు వీటిని అందించనుంది. ఒక ఫుడ్ బాస్కెట్ విలువ రూ.500 ఉంటుంది. 2 లక్షల మందికి వాటిని అందించేందుకు ప్రభుత్వం రూ.120.40 కోట్లు ఖర్చు చేయనుంది. వీటిని పౌరసరఫరాల శాఖ ద్వారానే గిరిజనులకు అందిస్తారు. తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం రూ.40 కోట్లు విడుదల చేసింది. ఈ పథకాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం రెండు కమిటీలను నియమించింది. శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్న ఐటీడీఏకు ప్రత్యేక కమిటీ ఉంటుంది.
