Published: 11-01-2019

భవిష్యత్తులో ప్రపంచ దృష్టి మన డేటా సేవలపైనే

అమరావతి: నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం చివరిరోజు జన్మభూమిపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘యావత్ ప్రపంచమే మన వైపు చూస్తోంది. మనది బలహీన బృందమని చిన్నచూపు చూశారు. ఆ బృందంతోనే అద్భుతాలు సృష్టించాం..670అవార్డులు సాధించాం’ అని బాబు అన్నారు. అధికార, ఉద్యోగ బృందాన్ని చూసి గర్విస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. ఏపీఆర్టీజీని టోనీ బ్లెయిర్, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్ అభినందించారన్నారు. సింగపూర్‌లో లేని వ్యవస్థకు ఏపీ శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.
 
ఎల్‌ఈడీ బల్బులు నూతన ఆవిష్కరణ అని..ప్రకృతి వ్యవసాయం మరో ఆవిష్కరణ అని అన్నారు. ఒక్కరోజులోనే రూ.లక్ష కోట్ల పెట్టుబడులు ..లక్షా 30వేల మంది యువతకు ఉపాధి ఒక చరిత్ర అని సీఎం పేర్కొన్నారు. సులభతర వాణిజ్యంలో తామే ముందున్నామని తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచ దృష్టి ఏపీ డేటా సేవలపైనే ఉంటుందని చెప్పుకొచ్చారు. కేంద్రం దేనికీ సహకరించకున్నా తమ కష్టంతో ముందుకు వెళ్తున్నామన్నారు. జన్మభూమిలో వినతుల సంఖ్య తగ్గడమే తమ పనితీరుకు నిదర్శనమన్నారు. రేపటి నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు తెలియజేశారు.