Published: 09-01-2019
‘శ్రీచైతన్య’ భవనం పైనుంచి పడి విద్యార్థి దుర్మరణం

కృష్ణా జిల్లా కంచికచర్లలోని శ్రీచైతన్య స్కూల్ భవనంపై నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండడంతో కలెక్టర్ లక్ష్మీకాంతం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ప్రాథమిక సమాచారం మేరకు.. వీరులపాడు మండలం కొణతాలపల్లికి చెందిన శీలం తిరుపతిరెడ్డి, మంగమ్మల కుమారుడు సాయిబాబా నాగార్జునరెడ్డి అలియాస్ సాయి(13) శ్రీచైతన్యలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం స్కూల్‌కు వచ్చిన సాయి.. హైవేపై జరుగుతున్న 5కె రన్ చూసేందుకు స్కూల్ భవనంపైకి ఎక్కి, ప్రమాదవశాత్తు జారి సరాసరి ఇనుప గేటు మీద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన సాయిని పీహెచ్‌సీకి తరలించగా, మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. స్కూల్ అనుమతి రద్దుచేసి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థి బంధువులు, వైసీపీ, ఎస్‌ఎ్‌ఫఐ నేతలు, కార్యకర్తలు మృతదేహాంతో స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేశారు. రూ.20 లక్షల పరిహారం చెల్లించేందుకు స్కూల్ యాజమాన్యం అంగీకరించటంతో ఆందోళన విరమించారు. కాగా, ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమైన ఈ స్కూల్‌కు 7వ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉండగా, 8వ తరగతి కూడా నిర్వహిస్తుండడం గమనార్హం.
విద్యార్థి మృతి ఘటనపై వాస్తవాలు దాస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉపాధ్యాయులు మందలించటంతో మనస్థాపం చెంది భవనంపై నుంచి దూకాడన్న ప్రచారం కూడడా జరుగుతోంది. కానీ, భవనంపై నుంచి కిందకు చూస్తుండగా పడిపోయాడన్న వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై కలెక్టర్ లక్ష్మీకాంతం మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డీఈవోను ఆదేశించినట్లుగా కలెక్టర్ పేర్కొన్నారు.
