Published: 04-01-2019
2019 ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ పోటీ

పొత్తులపై జనసేనాని స్పష్టతనిచ్చారు. వరుస ట్వీట్లలో 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తామని తేల్చిచెప్పారు. ‘‘వామపక్షాలతో తప్ప ఎవరితో కలిసి వెళ్లము. 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ. యువతకు, మహిళలకు అధిక ప్రాధాన్యం. అధికార, ప్రతిపక్షాల మాటలను ముక్తకంఠంతో ఖండించండి’’ అంటూ ఓపోస్టర్‌ని కూడా ట్విట్టర్‌లో ఉంచారు. దానితోపాటు పవన్ మాట్లాడిన 25సెకన్ల వీడియోని అప్‌లోడ్ చేశారు. ఆ తరువాత జనసేన ప్రకటనను అధికారిక ఖాతాలో పోస్టు చేశారు. ‘‘రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఒంటరిగా 175స్థానాల్లో పోటీ చేస్తుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు చేసే అసత్య ప్రచారాలను నమ్మవద్దు. వామపక్షాలు మినహా అధికారపక్షంతో గానీ, ప్రతిపక్షంతో కానీ కలిసే పరిస్థితులు, అవకాశాలు లేవు. జనసేన పార్టీ వాళ్లతో కలుస్తుంది, వీరితో కలుస్తుంది అని ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షం మాకు అన్ని స్థానాలు ఇచ్చింది, ఇన్ని స్థానాలు ఇచ్చిందంటూ రకరకాల ప్రచారాలతో జనసేన శ్రేణుల్ని గందరగోళానికి గురి చేసి, స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవన్నీ మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలే. అధికారపక్ష నాయకులు సైతం ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడం కూడా గందరగోళానికి గురి చేసేందుకే. 2014లో తెలుగు ప్రజల సుస్థిరత కోసం కొన్ని పార్టీలకు మద్దతు ఇచ్చాం. ఇప్పుడు సమతుల్యత కోసం జనసేన పార్టీ 175 స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తుంది. 25 సంవత్సరాలపాటు యువత భవిష్యత్తుకు అండగా ఉండాలన్న లక్ష్యంతో కొత్త తరం నాయకత్వం వైపు చూస్తున్నాం. అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులతోపాటు 175 స్థానాల్లో ఎక్కువ శాతం యువతకు అవకాశం ఇవ్వబోతున్నాం. మహిళలు, యువతతో పాటు కొత్తతరం బయటకు రావాలి. చట్టసభల్లో అడుగుపెట్టాలి.
ఇందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తున్నాం. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన జిల్లా స్థాయి నాయకులు గానీ, రాష్ట్ర స్థాయి నాయకులుగానీ ‘జనసేనతో మాట్లాడేశాం. స్థానాలు ఇచ్చేశాం’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు జనసేన తమతోకలిసి పోటీ చేస్తాయని ప్రచారం చేసుకోవడం మన బలాన్ని తెలియజేస్తుంది. మన పార్టీకి ఉన్న విశేషమైన యువశక్తిని రాజకీయ శక్తిగా మార్చాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం విజయవాడ పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లా కార్యకర్తలతో సమావేశమయ్యారు.
