Published: 12-12-2018
అనైతిక పొత్తుకు వ్యతిరేక తీర్పిది

‘‘భస్మాసురుడు చేయి పెట్టినా... చంద్రబాబు కాలు పెట్టినా అంతా బూడిదే. తాజా ఫలితాలతో ఏపీ ప్రజలకే కాకుండా దేశ ప్రజలకు కూడా చంద్రబాబు గురించి అర్థమైపోయింది. కాంగ్రెస్, టీడీపీల అనైతిక పొత్తుకు వ్యతిరేకంగా వెలువడ్డ తీర్పిది. ‘ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా ఓట్లేస్తారు’ అనుకునే రాజకీయ నాయకులకు ప్రజలు సరైన బుద్ధి చెప్పారు’’ అని వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు. ప్రజాసంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో తెలంగాణ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ జగన్ టీడీపీపై నిప్పులు చెరిగారు. ‘తెలంగాణ ఎన్నికల తీరును పరిశీలిస్తే ఏపీ సీఎం యుద్ధం చేస్తున్నారా? లేక ఆయన కోసం మీడియా యుద్ధం చేస్తోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, టీడీపీ కలిసి ఎన్నో జిమ్మిక్కులు చేశాయి. చంద్రబాబు నాలుగేళ్ల అవినీతి పాలనపై కాంగ్రెస్ పార్టీ పుస్తకం వేసి దానికి ‘చార్జిషీట్’ అనే పేరుపెట్టి రాహుల్ గాంధీ ఫొటోతో విడుదల చేసింది. తెలంగాణ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, చంద్రబాబు ఒకే స్టేజ్‌పై పక్కపక్కన కూర్చున్నారు. వీరిద్దరి రాజకీయాలను ప్రజలు ఎలా నమ్మి ఓట్లు వేస్తారు? కాంగ్రె్‌సతో పొత్తుకు ముందు చంద్రబాబు టీఆర్‌ఎస్‌తో పొత్తుకోసం ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని, దాన్ని బతకనివ్వకూడదని చెప్పిన చంద్రబాబు ఆ పార్టీతో పొత్తుపెట్టుకోవడం దుర్మార్గ రాజకీయాలకు పరాకాష్ఠ. ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చారు’ అని జగన్ అన్నారు.
