రైతులకు సుభాష్ పాలేకర్ పిలుపు

పర్యావరణ విధ్వంసంపై రైతులు శాంతియుత ఆందోళన చేపట్టాలని ప్రకృతి సేద్యం సృష్టికర్త సుభాష్ పాలేకర్ పిలుపునిచ్చారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులు, పరిశ్రమలు సృష్టిస్తున్న కలుషితం వలన పర్యావరణం, భూమి పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్‌లో సోమవారం మూడో రోజు జరిగిన ప్రకృతి సేద్యం శిక్షణ తరగతుల్లో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వాలు ఉపాధి పేరుతో ప్రజలను అనారోగ్యం పాలు చేసే పరిశ్రమలు, కంపెనీలను స్థాపించడం వలన వచ్చే కలుషిత వ్యర్థ పదార్థాలతో సమాజానికి ఎంతో హాని కలుగుతోందన్నారు. ప్రకృతిలో ఉన్న సహజ వనరులను రసాయనాలు విధ్వంసం చేస్తున్నాయన్నారు. బ్రెష్‌లు, పేస్ట్‌లు వంటి వాటివల్ల కూడా నీటిద్వారా రసాయనాలు భూమిలో కలుస్తున్నాయన్నారు. అలాగే రసాయనాలతో కూడిన పాలిస్టర్ వస్త్రాల కంటే ఖాదీ వస్త్రాలు ధరించడం మేలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు పెండేకంటి విజయ కుమార్ మాట్లాడుతూ అనంతపురం వంటి వర్షాభావ ప్రాంతాల్లో కూడా ప్రకృతి సేద్యం బాగా జరుగుతున్నట్టు చెప్పారు.
