కోడికత్తిని వదలకపోతే ఆ పార్టీకే నష్టం
Published: 19-11-2018

‘‘వైసీపీకి బలం, బలహీనత రెండూ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డేనని ఆయన పార్టీకి చెందిన నాయకులే చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో చంద్రబాబుకి సరైన ప్రత్యామ్నాయం జగనే. అయితే, లాజిక్‌లను మిస్ కాకుండా చూసుకోవాలి. కోడి కత్తి ఘటనలో ముందు వైసీపీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడడం వల్లే టీడీపీ నాయకులు మాట్లాడాల్సి వచ్చింది. వైసీపీ అధ్యక్షుడిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటన ముగిసిన అధ్యాయం’’ అని అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. జగన్‌పై దాడి ఘటనపై టీడీపీ-వైసీపీల మధ్య నడుస్తున్న ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘కోడికత్తిపై ప్రజలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశారు. అపరిపక్వతతోనే శ్రీనివాసరావు జగన్‌పై దాడి చేశాడు. జగన్ పై ఉన్న ఇష్టం... జగన్‌కు ప్రజల్లో సానుభూతి పెంచేందుకే తాను దాడి చేసినట్టు స్వయంగా శ్రీనివాసరావు పేర్కొనడమే దీనికి నిదర్శనం. ఘటన జరిగిన వెంటనే జగన్ కూడా దీనిని పెద్దగా పట్టించుకోకుండానే విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోయాడు.
అయితే దీనిని రాజకీయ లబ్ధికి వాడుకోవచ్చునని కొంతమంది నేతల సలహాల ఇవ్వడంవల్లే హైదరాబాద్ వెళ్లి ఆస్పత్రిలో చికిత్సపొందాడు. రాజకీయ ప్రయోజనం పొందాలనే భావనతో వైసీపీ నేతలు ఆరోపణలు చేయడంతో టీడీపీ నేతలు ఎదురుదాడి ప్రారంభించాల్సి వచ్చింది. రాష్ట్రంలో హత్యారాజకీయాలు లేవు. తన హత్యకోసం చంద్రబాబు కుట్రపన్నారని జగన్ ఆరోపించడం పూర్తిగా అసంబద్ధం. రిజర్వేషన్ల అంశంపైనా, పవన్‌కళ్యాణ్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినప్పుడూ వాటిని వెనక్కితీసుకున్న మాదిరిగానే దీనిని కూడా జగన్ వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనిని ఇప్పటికైనా ఆపేస్తే వైసీపీకే మంచిది. కోడి కత్తి ఘటనలో సీబీఐతో విచారణ జరిపించినా టీడీపీకి ఎటువంటి ఇబ్బందీ రాదు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలి. ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయపార్టీలు తమ లబ్ధి కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచించడం సాధారణమే. అయితే ప్రతివ్యూహాలు గట్టిగా ఉన్నపుడు కోడికత్తిలాంటివి అపహాస్యం పాలవుతాయి’’ అని హరి అన్నారు.

Share this on your social network: