వారసుడొస్తున్నాడా!

* యాక్టివ్ పాలిటిక్స్‌లోకి బీబీఆర్ తనయుడు
* టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం
* స్పష్టత ఇవ్వని బీవీఆర్
కాకినాడ: బీబీఆర్ అదొక బ్రాండ్. పార్టీలు, పదవులతో సంబంధం లేకుండా రాజకీయంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు దివంగత నేత బొడ్డు భాస్కరరామారావు. టీడీపీలో ఆయన పలు కీలక పదవులతోపాటు పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గతంలో పనిచేశారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంది. ఆయన వారసుడు కూడా పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. కోవిడ్ నేపథ్యంలో గతేడాది బీబీఆర్ మృతి చెందారు. అదే సమయంలో పలు పార్టీల నేతలు బీబీఆర్ తనయుడు బొడ్డు వెంకట రమణ చౌదరికి సానుభూతి వ్యక్తం చేసి పార్టీతోపాటు తాము కూడా అండగా ఉంటామని భరోసానిచ్చారు. రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని కోరినప్పటికీ తండ్రిని కోల్పోయిన బాధలో ఆయన అన్నింటికీ దూరంగా ఉన్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ, వైఎస్సార్ సీపీలు బీవీఆర్‌ను తమవైపు లాక్కునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో వచ్చేనెల 3వ తేదీన చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరుతున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో అనపర్తి, పెద్దాపురం నియోజకవర్గ టీడీపీ నేతల్లో కొంచెం హుషారు పెరిగింది. పార్టీలోకి సరైనోడు వస్తున్నాడంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బీవీఆర్ కార్యకర్తగా పనిచేయడమేంటి..
2014లో వైఎస్సార్ సీపీ నుంచి రాజమండ్రి పార్లమెంటు అభ్యర్ధిగా ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
తాజాగా బీవీఆర్ చంద్రబాబును కలిశారని, అనపర్తి, పెద్దాపురం నియోజకవర్గాల్లో కార్యకర్తగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించినట్లు ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది. దీనిపై పలువురు సీనియర్ నేతలు స్పందిస్తూ బీవీఆర్‌కు మంచి భవిష్యత్తు ఉందని, తనది కార్యకర్తగా పనిచేసే స్థాయి కాదని అంటున్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ పట్టు కోల్పోయిందని, చినరాజప్పకు ప్రజలు అవకాశం ఇవ్వరని అంటున్నారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో టీడీపీ తరుపున బీవీఆర్ పోటీ చేస్తేనే టీడీపీ విజయం సాధిస్తుందంటున్నారు. నేరుగా బీవీఆర్ పోటీ చేస్తే టీడీపీ నెగ్గుతుందే తప్ప, చినరాజప్పకు మద్దతిస్తే పనవ్వదంటున్నారు. భాస్కరరామారావుకు కమ్మ సామాజికవర్గంతోపాటు కాపు సామాజికవర్గంలోనూ మంచి పేరుంది. కాబట్టి ఆయనకు పెద్దాపురం సీటు ఇస్తేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
వైఎస్సార్ సీపీ పిలుస్తోందా..
మరోవైపు బీవీఆర్‌ను వైఎస్సార్ సీపీకూడా ఆహ్వానిస్తుందని ఆనోటా ఈనోటా వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల సమయంలో తండ్రీకొడుకులిద్దరూ పార్టీలోనే ఉన్నప్పటికీ క్రియాశీలకంగా వ్యవహరించలేదు. అయితే వారు పార్టీకి దూరమవ్వలేదని, వైఎస్సార్ సీపీలోనే ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో బొడ్డు ఫ్యామిలీకి మంచి ఫాలోయింగ్ ఉంది. బొడ్డు వారసుడు బీవీఆర్‌కు పెద్దాపురం సీటు ఇస్తే తండ్రి మీదున్న సానుభూతితో పార్టీని ఆదరిస్తారని, దీనిపై పార్టీ హైకమాండ్‌కు రిపోర్టు అందిందని విశ్వసనీయ సమాచారం. పైగా ఇక్కడ కోఆర్డినేటర్ దవులూరిపై సొంతపార్టీ కార్యకర్తలే ఆరోపణలు, తిరుగుబాట్లు చేయడంతో పార్టీ అసంతృప్తిగా ఉంది.
క్లారిటీ ఎప్పుడో..
బీవీఆర్ ఏ పార్టీలో చేరుతారనే దానిపై సర్వత్రా చర్చించుకుంటున్నారు. 3వ తేదీన టీడీపీలోనని కొందరు, కాదు వైఎస్సార్ సీపీలోనే కొనసాగుతున్నారని మరికొందరు, పెద్దాపురం వైఎస్సార్ సీపీ టికెట్ తనకేనని మరికొందరు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. అయితే ఆయన రాక కోసం బొడ్డు అనుచరులు, అభిమానులు, సన్నిహితులు, బంధువులు ఎదురుచూస్తున్నారు. ఎంత త్వరగా దీనిపై స్పష్టత వస్తుందోనని మల్లగుల్లాలు పడుతున్నారు. ఆయన ఏ పార్టీలోకి వచ్చినా పూర్తి మద్దతిస్తామని, బొడ్డు వారసుణ్ని గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. మరి దీనిపై ఆయన త్వరలోనే స్పందించి స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

Share this on your social network: