ఒకే వరలో మూడు కత్తులా !

* పెద్దాపురం టీడీపీ టికెట్‌పై సందిగ్ధత
* సతమతమవుతున్న ఎమ్మెల్యే చినరాజప్ప
* లోకేష్ దృష్టిలో గుణ్ణం, బొడ్డు పేర్లు
* నేనే అభ్యర్థినని ప్రకటించుకుంటున్న రాజప్ప
పెద్దాపురం: ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవు అన్నట్లు ఒకే పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఇమడలేరు. పెద్దాపురం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలోనూ ఇదే జరుగుతోంది. కాకపోతే ఇక్కడ ఇద్దరు కాదు. ముచ్చటగా ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. అందులో ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే చినరాజప్ప అయితే మరొకరు బొడ్డు తనయుడు వెంకటరమణ చౌదరి, ఇంకొకరు గుణ్ణం చంద్రమౌళి. ఫలితంగా పెద్దాపురంలో టీడీపీ మూడు ముక్కలైందని సర్వత్రా భావిస్తున్నారు. ఇద్దరు నాయకులూ టికెట్ కోసం ఆశిస్తున్నప్పటికీ మాకేం తెలియదంటూ మిన్నకుండిపోతున్నారు. తెర వెనుక మాత్రం చాపకింద నీరులా తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే చినరాజప్ప పరిస్థితి మాత్రం అలాలేదు. టికెట్ కోసం తీవ్రంగా సతమతమవుతూనే పైకి గంభీరంగా వ్యవహరిస్తున్నారు.
నేనే అభ్యర్థిని..
వచ్చే ఎన్నికల్లో టీడీపీ పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే.. నాతో పార్టీ అధినేతే చెప్పారు నువ్వే అభ్యర్థివని.. ఇప్పుడు ఇవే మాటలు ఎక్కడిపడితే అక్కడ మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే చినరాజప్ప. కానీ సోషల్ మీడియాతోపాటు పార్టీలోని ఇతరులు కూడా చిరనాజప్పకు ఈసారి టికెట్ కష్టమేనని బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. దీంతో ఎమ్మెల్యేకు చిర్రెత్తుకొస్తుందని ఆనోటా ఈనోటా ప్రచారం జరుగుతోంది. దాని కారణంగానే ఆయనెక్కడికి వెళ్లినా, ఎవరూ అడగకపోయినా నేనే అభ్యర్థినంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
పెద్దాపురం టీడీపీలో ఏం జరుగుతోంది..
పార్టీ అధినేత చంద్రబాబునాయుడే వచ్చే ఎన్నికల్లో కూడా పెద్దాపురం టీడీపీ టికెట్ నీకేనంటూ నాకు మాటిచ్చారని సిట్టింగ్ ఎమ్మెల్యే చినరాజప్ప పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. కానీ దీనిలో ఏమాత్రం వాస్తవం లేదని పార్టీలోని ఇతర నాయకులతోపాటు కార్యకర్తలు సైతం చెవులు కొరుక్కుంటున్నారు. మళ్లీ ఆయనకే టికెట్ ఇస్తే ఆ విషయాన్ని చంద్రబాబే నేరుగా మీడియా ఎదుట బహిర్గతం చేసేవారని, అలా చెప్పలేదంటే టికెట్ ఎవరికివ్వాలనే దానిపై ఇంకా స్పష్టత లేదంటున్నారు. ఇక బొడ్డు వెంకటరమణ చౌదరి విషయానికొస్తే తన అనుచరవర్గం నిర్ణయం మేరకూ, పార్టీ అధినేత ఆదేశాల మేరకూ మౌనంగా ఉన్నట్లు తెలుస్తుంది. గుంపులు కట్టకుండా పార్టీ కోసం పనిచేయి, పార్టీ నీకోసం ఎప్పుడేం చేయాలో చేస్తుందని చంద్రబాబు బొడ్డు తనయుడిని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. దానికి తగ్గట్టుగానే ఆయన కూడా పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అలాగే గుణ్ణం చంద్రమౌళి విషయానికొస్తే పార్టీలోని సీనియర్ నాయకులందరినీ తనదైన శైలిలో కలుపుకుపోతున్నారు. తన బలగాన్ని పెంచుకుంటూ ప్రజల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. టికెట్ మౌళీకి ఇస్తారు కాబట్టి దూకుడు పెంచాడన్నట్టుగా టీడీపీ వర్గం కూడా భావిస్తుంది.
లోకేష్ ఎదుట రెండు ప్రతిపాదనలు..
నారా లోకేష్ టేబుల్‌పై ఎమ్మెల్యే అభ్యర్థులుగా బొడ్డు, గుణ్ణం పేర్లు ప్రతిపాదనలున్నాయని పలువురు సీనియర్ నాయకులు చెబుతున్నారు. అయితే ఈసారి వైఎస్సార్ సీపీ బలంగా ఉండటం, పెద్దాపురం వైఎస్సార్ సీపీ అభ్యర్థి యువకుడై ఉండటం వల్ల చినరాజప్పకు కాకుండా టీడీపీ నుంచి యువ నాయకులిద్దరిలో ఒకరికి అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్ నాయకులు పార్టీ హైకమాండ్‌కు సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే చినరాజప్ప పార్టీలో బీవీఆర్ కంటే ఎక్కువగా గుణ్ణం చంద్రమౌళికి ప్రాధాన్యతనిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీవీఆర్ పార్టీలో చేరినప్పటి నుంచి ఆయనను ఏ కార్యక్రమానికి పిలవకపోవడం, ఆయన అభిప్రాయాన్ని తీసుకోకపోవడంపై బొడ్డు ఫ్యామిలీతో చినరాజప్పకు ఉన్న విరోధాన్ని తేటతెల్లం చేస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు.

Share this on your social network: