దాగుడుమూతల రాజకీయం!

* దవులూరిపై విరుచుకుపడుతున్న వ్యతిరేక వర్గం
* పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు
* ఆధారాలున్నాయంటూ ప్రచారం
* నోరుమెదపని కోఆర్డినేటర్
* మౌనం అర్ధాంగీకారమా!
* ప్లీనరీలో పరిష్కారమవుతోందా
పెద్దాపురం: నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ రాజకీయం పూటకో విధంగా మారుతోంది. పెద్దాపురం వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబుపై వ్యతిరేక వర్గం ఒకటే పనిగా విరుచుకుపడుతోంది. దానికి తగ్గట్టుగానే ఆయన కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సమాధానమిస్తున్నారు. ఒక పక్క పార్టీకి కష్టపడి పనిచేశామని కర్రి వెంకటరమణ, కరణం భాను, లింగం శివప్రసాద్, బీపెల్లి పండు, గోలి దొరబాబు, పాఠంశెట్టి నాగరాఘవ వంటి వారు పార్టీలోనే ఉంటూ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టారు. పెద్దాపురంలోని గోలి రామారావు ఇంట్లో వీరు చేపట్టిన కార్యక్రమానికి సుమారు 60 నుంచి 80 మంది వరకూ సామాన్య కార్యకర్తలు మద్దతు తెలిపారు. దవులూరిని దించేయాలని ప్రతినబూనారు.
దవులూరేమీ తక్కువ కాదుగా..
గోలి రామారావు ఇంట్లో పెట్టిన కార్యక్రమానికి ధీటుగా పెద్దాపురం అంబేడ్కర్ భవన్లో పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి పిలుపు మేరకూ పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు హాజరయ్యారు. అందరూ మంచి పదవులు ఉన్నవారే హాజరయ్యారు. కర్రి వెంకటరమణనే టార్గెట్‌గా పెట్టుకుని వ్యాఖ్యలు చేశారు. నెక్కంటి సాయి, తదితరులైతే నేరుగా మేమేం గాజులు తొడుక్కోలేదు, దవులూరిని తరిమికొడతానంటావా అవసరమైతే నీదగ్గరకే వస్తామంటూ ధ్వజమెత్తారు. బెల్లం ఉన్న చోటే చీమలు తిరుగతాయన్నట్టు ప్రస్తుతం దవులూరి చుట్టూనే ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.
సమాధానమివ్వని నెక్కంటి..
అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నేతలు దవులూరిని బాగా వెనకేసుకువచ్చారు. అయితే అదే సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు మాట్లాడుతూ వ్యతిరేక వర్గాన్ని కలుపుకుపోతామని అర్ధంకాని సమాధానమిచ్చారు. అనంతరం నెక్కంటిని మీడియా ప్రశ్నించగా దవులూరిని వెనకేసుకురావడం, వ్యతిరేకవర్గంపై సీరియస్‌గా మాట్లాడటం తప్ప సరైన సమాధానం ఇవ్వలేదు. ఇంతలోనే పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపిస్తుండటంతో సమాధానమివ్వలేక జైజగన్, జై దవులూరి అంటూ నినాదాలు చేస్తూ పార్టీ నేతలతో సహా నెక్కంటి కూడా అక్కడి నుంచి జారుకున్నారు.
దవులూరికి సమాధానమిచ్చే ధైర్యం లేదా..
మౌనం అర్ధాంగీకారమని మన పెద్దలు చెబుతుంటారు. వ్యతిరేక వర్గం దవులూరిపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నా ఆయన పట్టించుకోనట్టు వ్యవహరిస్తుంటారు. కానీ వ్యతిరేక వర్గంలో ఉన్న బీపెల్లి పండు పోస్టింగులపై సామర్లకోట ఎస్సీ నాయకుడు ఊబా జాన్‌మోజెస్‌తో ప్రెస్‌మీట్ పెట్టించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే లింగం శివప్రసాద్ తలపెట్టిన దవులూరిపై తిరుగుబాటు కార్యక్రమానికి సమాధానంగా పెద్దాపురంలో అంబేడ్కర్ భవన్ అంకితం కార్యక్రమం పేరుతో మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీతో మరో కార్యక్రమం చేపట్టి ప్రజల దృష్టిని మళ్లించారు. ఇటీవల గోలి రామారావు స్థాయికి తగ్గట్టుగా నెక్కంటి సాయితో మరో కార్యక్రమం చేపట్టి తనదైన శైలిలో సమాధానమిప్పించారు. అంతేకానీ ఆయన మాత్రం నేరుగా ఎన్నడూ సమాధానమివ్వలేదు.
భాను దగ్గర ఆధారాలున్నాయా.. లేవా..
దవులూరి అక్రమాలకు సంబంధించి మా దగ్గర ఆధారాలున్నాయని మీడియా ముందు కరణం భాను ప్రస్తావించారు. వాటిని మాకివ్వగలరా అని మీడియా అడగడంతో అధిష్టానానికే ఇస్తామని చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఎందుకని వాటిని అధిష్టానానికి ఇవ్వలేదు, ఎందుకు బయట పెట్టడం లేదని పాత్రికేయులు ప్రశ్నించడంతో దానికి సమయం ఉందని చెప్పుకొచ్చారు. ఇదంతా చూస్తుంటే అసలు ఆధారాలున్నాయా లేవా అనే సందేహం కూడా మీడియాకు తట్టింది. ఈ వ్యతిరేకవర్గం నాలుగు రోజుల క్రితమే కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ద్వారంపూడి, కురసాలను కలిసి పూసగుచ్చినట్లు పార్టీ పరిస్థితిని వివరించారు. దీనిపై అందరూ ఓసారి భేటీ అవుదామని వారు సమాధానమిచ్చారు. అప్పటివరకూ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టొద్దన్నారు.
ప్లీనరీతో చెక్ పడుతోందా..
నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించే ప్లీనరీ సమావేశంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. అయితే ఈ మీటింగుకు వ్యతిరేకవర్గం హాజరవుతుందా అనే ప్రశ్న అందరినీ తొలిచేస్తుంది. ఒకవేళ హాజరైతే దవులూరిని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగుతారా లేదంటే మిన్నకుండిపోతారా అనే సందేహం వెంటాడుతోంది. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలు ఈ ప్లీనరీ సమావేశంతో తొలగిపోతాయా లేక ఇంకా ముదిరిపోతాయా అని అందరూ ఆలోచిస్తున్నారు.

Share this on your social network: