కొంపలో కుంపటి

* పెద్దాపురం వైఎస్సార్ సీపీలో వర్గాల పోరు
* దెబ్బతింటున్న పార్టీ ప్రతిష్ట
* అందరి టార్గెట్ దవులూరే
కాకినాడ: పెద్దాపురం వైఎస్సార్ సీపీలో బాహుబలి కట్టప్పలు ఎక్కువయ్యారు. ఎవరికి వారు ఆపార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరికి వెన్నుపోటు పొడుస్తూ పార్టీ శ్రేయస్సు కోసమేనంటున్నారు. దవులూరి దొరబాబు పార్టీని బ్రష్టుపట్టిస్తున్నారని, గత ఎన్నికల్లో తోట వాణీ ఓటమికి కారణమయ్యారని ఆరోపిస్తున్నారు. పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. అయితే అదే కట్టప్పలపైనా విమర్శలు అధికమయ్యాయి. దవులూరిపై వ్యక్తిగత కక్షతోనే పార్టీ హైకమాండ్ దగ్గర పరువు తీస్తున్నారని, తోట ఫ్యామిలీ దగ్గర డబ్బులు తీసుకుని దవులూరిని విమర్శిస్తున్నారని ప్రజానీకం చెబుతోంది. దళిత సంఘాల నాయకులు ఇరుక్కున్న వివాదాల్లోకి దవులూరిని లాగితే ఆయన మాత్రం ఏం చేస్తాడంటున్నారు.
అసలేం జరుగుతోంది..
పెద్దాపురం మండలానికి చెందిన కర్రి వెంటకరమణ వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఏనాడూ ఎవరికీ కనిపించలేదు. అటువంటిది ఇటీవల కాలంలో ఆయన ప్రెస్‌మీట్‌లు పెట్టి దవులూరిని వ్యతిరేకించడం, తన పనితీరును ఎత్తిచూపించడం వంటివి చేస్తున్నారు. పార్టీని నాశనం చేస్తున్నావంటూ ఆయనకే ఉత్తరాలు పంపిస్తున్నారు. గతంలో వీరిద్దరి మధ్య ఏమీ లేకున్నప్పటికీ ఈమధ్యన వరుసగా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడంతో ఇద్దరికీ వ్యక్తిగత విభేదాలున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. వాటిని పార్టీకి ఆపాదించి దవులూరికి టికెట్ లేకుండా చేద్దామని అనుకుంటున్నారని సర్వత్రా చర్చించుకుంటున్నారు. దానికితోడు రెండ్రోజుల క్రితం హైదరాబాదులోని ఐప్యాక్ బృందాన్ని సందర్శించి పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పనితీరు బాగోలేదని నివేదించడం దవులూరిపై ఆయనకున్న అక్కసును వెల్లగక్కుతుంది. నిజంగా వీరికి పార్టీ మీద అభిమానం ఉంటే పార్టీ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరించని, దవులూరిని వీధిలోకి లాగరని ప్రజలు చెబుతున్నారు.
తిరుగుబాటుదారులు..
సామర్లకోటకు చెందిన ఆంధ్ర మాలమహానాడు వ్యవస్థాపకుడు లింగం శివప్రసాద్ రెండు నెలల క్రితం వైఎస్సార్ సీపీ దళిత వ్యతిరేకుల తిరుగుబాటు కార్యక్రమం చేపట్టి దవులూరిని పెద్ద ఎత్తున దుయ్యబట్టారు. నిన్ను గద్దె దించడమే ధ్యేయమని ఉపన్యాసాలు చేశారు. అతని బృందం కూడా సోషల్ మీడియాలో దవులూరిపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి పరువు తీసిపడేస్తున్నారు. పార్టీలోని కార్పొరేటర్లపై దళితులతో కేసులు, దళితులపై అగ్రవర్ణాలతో కేసులు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. దళితుల ద్రోహి దవులూరని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇతనిపై కూడా కొన్ని ఆరోపణలున్నాయి. తోట ఫ్యామిలీ దగ్గర ప్యాకేజీ తీసుకుని దవులూరిని విమర్శిస్తున్నారని వంగా గీతా ఫాలోవర్స్ వాట్సాప్ గ్రూపులో వర్గ పోరు జరిగింది. రెండు రోజులపాటు ఇదే పంధా కొనసాగడంతో దవులూరి వర్గం వాట్సాప్ గ్రూపు నుంచి వైదొలిగారు. ఈ గ్రూపు కారణంగా పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని, దీనిలో కొనసాగబోమని కాకినాడ ఎంపీ వంగా గీత, పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి, ఇతర నాయకులందరూ వైదొలిగారు. చివరిగా ఆ గ్రూపులో దవులూరి వ్యతిరేకులు మాత్రమే మిగిలారు.
అసలైన కట్టప్ప ఎవరు..
సామర్లకోట రూరల్‌కు చెందిన ఈ నాయకుడు పార్టీ కార్యక్రమాల్లో దవులూరి దొరబాబు వెనకే ఉంటారు. దవులూరిని ఎమ్మెల్యే చేయాలని ప్రసంగిస్తుంటాడు. చీకట్లో మాత్రం దవులూరి వ్యతిరేకులందరినీ ఏకతాటిపైకి తెచ్చి దిశానిర్ధేశం చేస్తుంటాడు. దవులూరికి నేనే రాజకీయం నేర్పించాను, అతనికి టికెట్ లేకుండా చేద్దామంటూ ప్రోత్సహిస్తుంటారు. అయితే ఒక విషయంలో మాత్రం ఇతన్ని మెచ్చుకోవచ్చు. పార్టీ హైకమాండుతో పనులు చేయించుకోవడంలో దవులూరికన్నా ఈయనే దిట్టని అందరూ కితాబిస్తుంటారు. ఇదంతా దొరబాబుకు తెలిసినప్పటికీ చూద్దాంలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రానున్న రోజుల్లో పరిస్థితులు ఇంకెలా ఉంటాయోనని చెవులు కొరుక్కుంటున్నారు.

Share this on your social network: