ప్రజల్లోకి ఎవరొస్తే వారికే!

* మొదటి వరుసలో దవులూరి
* బీవీఆర్‌కు పెరుగుతున్న బలం
* చినరాజప్పకు ఈసారి కష్టమే
* తోట నాయుడు కోసం అనుచరుల చూపులు
* జాడలేని తోట వాణీ నరసింహం
కాకినాడ: పెద్దాపురం నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటుంది. ఆయా పార్టీలు చాపకింద నీరులా తమ కార్యాచరణను రూపొందిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే నాయకులు కూడా ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పటికీ తదుపరి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే ప్రచారంలోకి దూసుకుపోతుంది. గడపగడపకూ వైఎస్సార్ సీపీ పేరుతో మరింత ఆదరణ పొందుతుంది. టీడీపీలో మాత్రం అంతా గందరగోళంగా ఉంది. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ప్రస్తావనే ఇంకా రాలేదు. దానికి తగ్గట్టుగానే నాయకులు కూడా ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడం లేదు. ఇక జనసేన విషయానికొస్తే పార్టీ అధినేత తమ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్ధేశం కూడా చేయలేదు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయా లేక ఎవరికీ వారు పోటీ చేస్తారా అనే దానిపై రెండు పార్టీల అధిష్టానాలకే స్పష్టత లేదు. పెద్దాపురం రాజకీయం కూడా ఇదే విధంగా సాగుతోంది.
దవులూరి దూకుడు..
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏనాడైతే గేర్ మార్చమన్నారో ఆనాడే దవులూరి రూటు కూడా మార్చారు. తనమీద నమ్మకంతో ఇచ్చిన నామినేటెడ్ పోస్టుకు ఎక్కడా మచ్చ రాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో తనపై విషప్రచారాలు చేస్తున్నప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా అధిష్టానం నిర్ణయాలను తూచాతప్పకుండా ఆచరిస్తున్నారు. ప్రభుత్వం తలపెట్టే ప్రతీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కోఆర్డినేటర్ బాధ్యతలు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి వన్నె తెస్తూనే ఎమ్మెల్యే టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తనకే టికెట్ ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా పార్టీకి ఇతనొక్కడే పెద్దగా ఉండటం, అంతా తానే చూసుకోవడం, ముందుగా ప్రజల్లోకి వెళ్లడం ఈసారి ఆయనకు కలిసొచ్చింది. ప్రజలు కూడా దవులూరిని ఆదరించడం, ఆయనకు ప్రతికూలమైన ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పథకాలు బాగా కలిసొస్తున్నాయి. అయినప్పటికీ టికెట్ విషయంలో ఎక్కడో ఏదో అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
బీవీఆర్ ముందుకు రావాలి..
టీడీపీలో చేరిన తర్వాత బీవీఆర్‌కు పార్టీ బలం బాగా పెరిగింది. చినరాజప్ప దగ్గరున్న కమ్మ సామాజిక వర్గం నేడు ఆయన చెంతకు వలసపోయింది. అలాగే తన తండ్రి మీదున్న అభిమానం, సానుభూతితో మరికొంతమంది ఆయన చెంతకు చేరారు. బీవీఆర్ టీడీపీలో చేరారే తప్ప ప్రజల్లోకి ఇంకా రావడం లేదు. పార్టీలో ఇప్పుడు బీవీఆర్‌ది ఒక వర్గం, చినరాజప్పది ఒక వర్గం అన్నట్టు తయారైంది. బీవీఆర్ రేపొద్దున్న ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా, ఎంపీగా పోటీ చేయాలన్నా మొదటిగా ప్రజలకు పరిచయం కావాలి. కానీ ఆయన మాత్రం కొంతమంది చెప్పే మాటలు విని ప్రజల్లోకి రావడం లేదు. బొడ్డు ఫ్యామిలీపై ఎంత అభిమానమున్నా ప్రజలు ఆయనను చూస్తేనే తప్ప ఫొటోను చూసి ఓట్లు వేసే పరిస్థితి లేదు. ప్రజల్లోకి రావడం దేవుడెరిగితే రెండు వర్గాల పోరు ఎప్పుడు ముగుస్తుందోనని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.
నియోజకవర్గానికి చినరాజప్ప దూరం..
చినరాజప్ప హయాంలో టీడీపీ నాయకులు బాగా సంపాదించుకున్నారు. ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. 2019 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యే అయినప్పటికీ పార్టీ అధికారంలో లేదు. పదవుంటే చాలు అన్నట్లు వ్యవహరించడంతో నియోజకవర్గానికి దూరమయ్యారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన వెనుక కొత్తెం కోటి, కందుల విశ్వేశ్వరరావు, ఎలిశెట్టి నాని, ఆనూరు అరవింద్, అంబటి దివాణం వంటి వ్యక్తులు మినహా పెద్దగా ఎవరూ లేరు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు విషయానికొస్తే ఆయన రూటే వేరు. ఆయన వెనుక ఎవరూ ఉండనవసరం లేదు. ఆయన ఎవరి వెనుక ఉండరనేది అందరికీ తెలిసిందే. మొత్తంగా చెప్పాలంటే చినరాజప్ప మౌనమే ఆయనకు దెబ్బకొట్టింది. ఎక్కడా నోరు మెదపలేదు కాబట్టే ప్రజలు ఆయనను త్వరగా మరిచిపోయారు.
నాయుడు రావాలి..
తోట నాయుడుకు మంచి గుర్తింపు, ఆదరణ ఉంది. తొమ్మిదేళ్లు పార్టీని తన భుజస్కంధాలపై మోశారు. దవులూరికి పార్టీ బాధ్యతలిచ్చిన తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్లిపోయారు. రానురానూ పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. అయితే ఆయన ఏనాడూ నేను మళ్లీ పలానా పార్టీలోకి వస్తున్నానని ప్రకటించలేదు. ఎక్కడా కూడా సరిగా కనిపించలేదు. కానీ ఈ మధ్యన ఆయన అభిమానులు నాయుడొస్తున్నాడంటూ ప్రచారాలు చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ టికెట్ ఆయనకేనని, సీఎం నుంచి పిలుపు వచ్చిందని పోస్టులు పెడుతున్నారు. అయితే ఒకవేళ ఆయన పార్టీలోకి వచ్చినా మళ్లీ మొదటి నుంచీ అందరినీ కలుపుకుపోతూ ప్రజల్లోకి వెళ్లాలి. ఇదంతా కూడా ఒక సంవత్సరంలో అయ్యే పనిలా కనిపించడం లేదని పలువురు సీనియర్ నాయకులు అంటున్నారు.
తోట వాణీ ఫ్యామిలీ ఎక్కడ..
2019 ఎన్నికల్లో తోట వాణీ స్వల్ప తేడాతో టీడీపీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆ కుటుంబం కొన్ని కారణాల రీత్యా రాజకీయాలకు దూరంగా ఉంది. కనీసం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియనంత దూరంగా ఉన్నారు. కొన్ని ఫంక్షన్లలో తోట రాంజీ కనిపించినప్పటికీ ఆయనకూ నియోజకవర్గానికీ సంబంధం లేనట్టుగానే వ్యవహరించారు. నరసింహం ఫ్యామిలీ పూర్తిగా జగ్గంపేట నియోజకవర్గంపై దృష్టి పెడుతుందని, పెద్దాపురం నియోజకవర్గంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తోట అనుచరులే చెబుతున్నారు. మొదట్లో మళ్లీ పెద్దాపురం టికెట్ వారికే ఇస్తారని ప్రచారాలు జరిగినప్పటికీ ఇటీవల కనీసం వారి ప్రస్తావన ఎక్కడా కూడా వినిపించడం లేదు.

Share this on your social network: