దూసుకుపోతున్న వైఎస్సార్ సీపీ

* గడపగడపకూ విశేష స్పందన
* ప్రజా సమస్యల పరిష్కారంలో దవులూరి
* నియోజకవర్గంలో కానరాని టీడీపీ
పెద్దాపురం: ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు కేవలం నోటిమాటకే పరిమితమైంది. పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారే తప్ప ప్రజల్లోకి వెళ్లేందుకు మొగ్గు చూపించడం లేదు. బీవీఆర్, చినరాజప్ప వర్గాలు టికెట్ ఎవరికి ఇస్తారనే సందేహంలో ప్రజల్లోకి వెళ్లకుండా దూరంగా ఉన్నారు. ఇక వైఎస్సార్ సీపీ విషయానికొస్తే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకు మే 11వ తేదీన ప్రారంభించిన గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఈసారి తన రూటు మార్చారు. గడపగడపకూ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి పక్కా ప్రణాళికలతో రెండు పట్టణాలతోపాటు రెండు మండలాల్లోనూ పర్యటిస్తున్నారు. అధిష్టానం ఆదేశాల మేరకూ ఎలాంటి విబేధాలకు తావివ్వకుండా ప్రతీ గడపనూ సందర్శించి చిన్నాపెద్దా తేడా లేకుండా వారితో మాటామంతి కలుపుతున్నారు. ఈ క్రమంలో తనను తాను ప్రమోట్ చేసుకుంటూ పార్టీని కూడా జయప్రదంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు.
టీడీపీ కంచుకోటకు భీటలు తప్పవా!
నాకు కాకపోతే టీడీపీ టికెట్ ఎవరికీ ఇస్తారంటూ చినరాజప్ప ఇప్పటివరకూ చెప్పుకొచ్చారు. టీడీపీకి పెద్దాపురం కంచుకోటని, మూడోసారి నెగ్గి చూపిస్తానని అంటున్నారు. కానీ నేడు ఆ పరిస్థితి నియోజకవర్గంలో లేదు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందినా పార్టీ అధికారంలో లేకపోవడంతో మూడేళ్లుగా ఆయన మౌనంగా ఉండిపోయారు. ప్రజలు కూడా ఆయనను త్వరగానే మరిచిపోయారనే దానిలో ఆలోచించాల్సిన పనిలేదు. బొడ్డు వెంకటరమణ చౌదరి కూడా టీడీపీలోకి రావడంతో చినరాజప్పకన్నా ఆయనకే పార్టీ బలం పెరిగింది. కానీ బీవీఆర్ కూడా ఇంకా ప్రజలకు పరిచయం కాలేదు. వీరిద్దరి పరిస్థితి చూస్తే టికెట్ ఎవరికి ఇస్తే వారే ప్రజల్లోకి వచ్చేలా ఉన్నారు. ఇప్పడు అదే టీడీపీ కంచుకోటకు భీటలువారేలా తయారైంది. ఇదే కారణం ఇటు దవులూరికి, అటు వైఎస్సార్ సీపీకి మరింత బలం చేకూరేలా చేసింది.

Share this on your social network: