మూడేళ్లలో ముంచేశారు!

* నియోజకవర్గంలో కుంటుపడిన అభివృద్ధి
* దొరబాబుకు పనిచేయడం రాదు
* చినరాజప్పకు పనేలేదు
దళిత్ వాయిస్: రెండు మున్సిపాలిటీలు, రెండు మండలాలు ఉన్న పెద్ద నియోజకవర్గం పెద్దాపురం. ప్రస్తుతం అభివృద్ధి పరంగా వెనుకంజలో ఉంది కూడా ఈ నియోజకవర్గమే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రూపాయిలో పావలా వంతు అభివృద్ధిని మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే చినరాజప్ప చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ నియోజకవర్గంలో చేయడానికి ఆయనకు పనిలేకుండా పోయింది. అలాగని తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం కూడా ఆయనకు లేదు. పైగా ఏమైనా పార్టీ కార్యక్రమాలు జరిగినప్పడు మాత్రం వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ నాకు కాకపోతే ఎవరికీ ఇస్తారంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవంలోకి వెళ్తే ఆయన వెనకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా ఈసారి సీటు వేరే వారికి ఇస్తేనే బాగుంటుందని, ఈయనకు ఇస్తే పనవ్వదని భావిస్తున్నారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే చినరాజప్ప సీన్ అయిపోయిందంటున్నారు.
దొరబాబుకు ఓటు వెయ్యాలా..
ఎవరీ దవులూరి దొరబాబు.. ఎప్పుడైనా ఏ గ్రామంలోకైనా వచ్చి ప్రజా సమస్యలను తెలుసుకున్నారానని ఏటిపట్టు గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. ఆయనకు పార్టీ బాధ్యతలు, పదవులు కావాలే తప్ప నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గంలోని ప్రజల సమాచారం, ప్రజా సమస్యలు ఆయనకు అవసరం లేదని అంటున్నారు. అలాంటి వ్యక్తికి ఎందుకు ఓటెయ్యాలని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఈ పెద్దాయన ఎక్కడికిపోయారో చెప్పాలని, గ్రామాల విషయం పక్కనపెడితే రెండు మున్సిపాలిటీల్లో చేసిందేముందని ప్రశ్నిస్తున్నారు. కోఆర్డినేటర్గా బాధ్యతలు స్వీకరించి పార్టీ అభివృద్ధికి ఏం చేశారో, పార్టీలో చేరికలు పెరిగాయా, చీలికలు పెరిగాయో బహిరంగంగా చెప్పే ధైర్యం దవులూరికి ఉందానని సవాల్ విసురుతున్నారు.
తోడు దొంగల రాజకీయం..
రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా వైఎస్సార్ సీపీకి, ఇతర పార్టీలకు మధ్య పచ్చగడ్డి కూడా భగ్గుమంటుంది. కానీ పెద్దాపురం నియోజకవర్గంలో మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. చెక్కుల పంపిణీలు, ఎండ్ల బండి పోటీలు, ముగ్గుల పోటీలు, బహుమతుల ప్రదానోత్సవాలంటూ జరిగే కార్యక్రమాల్లో చినరాజప్ప, దొరబాబు కలిసి ముచ్చట్లు, మాటామంతనాలు జరుపుతుంటారు. దీనికితోడు ఇరువురు నేతలూ స్టేజీలపైనే గుసగుసలాడుకోవడంతో రెండుపార్టీల నేతలూ, కార్యకర్తల్లోనూ అసంతృప్తి నెలకొంది. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసి అనేకసార్లు కేసుల పేరుతో మమ్మల్ని పోలీస్ స్టేషన్లకు తిప్పించిన చినరాజప్పతో సొంత పార్టీ కోఆర్డినేటర్ గూడుపుఠాని నడుపుతున్నారంటూ గ్రూపులు గ్రూపులుగా చర్చించుకుంటున్నారు. ఈ విషయం వైఎస్సార్ సీపీ హైకమిటీకి కూడా చేరిందని సొంత పార్టీ నేతలే ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఏదేమైనా ఈసారి ఆయా పార్టీల్లో టికెట్లు ఎవరికిస్తారనే దానిపై వాడీవేడిగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

Share this on your social network: