ఇదేంటి దొర‌.. ఇదేం పని

Published: 03-04-2022

* సొంత పార్టీకే వెన్నుపోటా!
* నాయుడు దూరం, వాణీ ఓట‌మికి మీరే కార‌ణమా!
* ద‌ళిత కార్య‌క‌ర్త‌ల‌పై కుట్ర‌పూరిత రాజ‌కీయాలా!
* తిరుగుబాటు చేసినా ఎందుకు స్పందించ‌రు?

పెద్దాపురం:  పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గ‌ వైఎస్సార్ సీపీ కోఆర్డినేట‌ర్ ద‌వులూరి దొర‌బాబుపై పార్టీ హైక‌మాండ్ గుర్రుగా ఉంద‌ని ఆనోటా ఈనోటా పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. ఒక ర‌కంగా ఇది నిజ‌మేన‌ని భావించాలి. ఎందుకంటారా మార్చి 30న జ‌రిగిన వైఎస్సార్ సీపీ ద‌ళిత కార్య‌క‌ర్త‌ల తిరుగుబాటు కార్య‌క్ర‌మం ఎఫెక్ట్ అలా ఉంది మ‌రి. పార్టీ సీనియ‌ర్ కార్య‌క‌ర్త, ఆంధ్ర మాల‌మ‌హానాడు వ్య‌వ‌స్థాపకుడు లింగం శివ‌ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్ర‌వ్యాప్తంగా పెద్ద దుమార‌మే రేపాయి. వైఎస్సార్ సీపీ మాది, ఇది మా మేన‌మామ పార్టీ, పార్టీ పుట్టిన నాటి నుంచి మేము జెండా మోస్తున్నాం. మ‌ధ్య‌లో వ‌చ్చిన నువ్వు మా ద‌ళితుల‌పై, ద‌ళిత కార్య‌క‌ర్త‌ల‌పై కుట్ర‌పూరిత రాజ‌కీయాలు చేస్తే ఊరుకోం. పార్టీ టికెట్ ఇవ్వ‌క‌పోతే పెట్టేబేడ స‌ర్దుకుని ప‌క్క పార్టీకి వ‌ల‌సపోతావు నువ్వు. మేమ‌లా కాదు చ‌చ్చే వ‌ర‌కూ పార్టీ కార్య‌క‌ర్త‌గానే ఉంటాం. జాగ్ర‌త్త‌గా ఉండు నిన్ను గ‌ద్దె దించేవ‌ర‌కూ విశ్ర‌మించ‌మ‌ని విరుచుకుప‌డ్డారు. ద‌వులూరి చేసిన అక్ర‌మాల‌ను ఎండ‌గ‌ట్టారు.

600 ఫేక్ ఎకౌంట్లా.. సిగ్గు సిగ్గు
పార్టీ పుట్టిన ద‌గ్గ‌ర నుంచి తోట నాయుడు జెండాను మోయ‌డంతోపాటు ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొన్నారు. అటువంటి సుబ్బారావు నాయుడిని ప‌క్క‌న పెట్టి ద‌వులూరికి పార్టీ బాధ్య‌తలు ఇచ్చారంటే మీరెంతో స‌మ‌ర్ధులు అనుకున్నాం. కానీ ఏంటి దొర టెక్నాల‌జీని బాగా వినియోగించుకుని 2 ల్యాప్‌టాప్‌లు, 600 ఫేక్ ఫేస్‌బుక్ ఎకౌంట్లు సృష్టించి నాయుడిపై బుర‌ద జ‌ల్లించారా ఇదేం ప‌నండి. దీన్ని బ‌హిర్గ‌తం చేసినా మీరెందుకు స్పందించ లేదండి.
వాణీ ఓట‌మికి 4 కోట్లు ఖ‌ర్చా..
ఆ మ‌ధ్య‌న మీ తండ్రి చేసిన వ్యాఖ్య‌లు గుర్త‌న్నాయా. రూ.4కోట్లు బెంగ‌పెట్టుకున్నామ‌న్నారు. పాపం ఆ వీడియో చూసిన‌వారంతా నిజంగా  న‌ష్ట‌పోయారేమో అని బాధ‌ప‌డ్డారు. కానీ మీకు టికెట్ ఇవ్వ‌కుండా తోట వాణికి ఇచ్చినందుకు, ఆమెను ఓడించ‌డానికి ఖ‌ర్చుచేశారనే మాట‌లు వింటుంటే సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లే గుర్రుమంటున్నారు. పైగా కొంత‌మంది మ‌హిళ‌ల‌ను మీ తండ్రి దుర్బాష‌లాడిన మాట‌లు, సామర్ల‌కోట‌లో ద‌ళిత యువ‌కుడి ఆత్మ‌హ‌త్య విష‌యంలో మీ వైఖ‌రిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తినా ఎందుకు స్పందిచ‌లేదంటూ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు దుమ్మెత్తిపోస్తున్నారు.
కుల రాజ‌కీయాలు మీకు త‌గునా!
మీపై పోస్టులు పెట్టిన ద‌ళిత‌యువ‌కుడిపైకి మీరు మీపార్టీ ద‌ళిత నాయ‌కులను ఉసిగొల్పి కులరాజ‌కీయాల‌కు ఆజ్యం పోసిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. మీ సొంత త‌ప్పిదాల‌ కార‌ణంగానే పార్టీలోని ద‌ళిత కార్య‌క‌ర్త‌లు తిరుగుబాటు చేయాల్సిన దౌర్భాగ్య ప‌రిస్థితి దాపురించింది. పైగా సామ‌ర్ల‌కోట‌లో మీకు వ్య‌తిరేకంగా జ‌రిగిన కార్య‌క్ర‌మాన్ని నీరుగార్చేందుకు అదే రోజు మీరో కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం మీ త‌ప్పుల‌ను క‌వ‌ర్ చేసుకునేందుకు చేశార‌ని అందరికీ తెలిసిపోయింది. పెద్దాపురంలో ఎప్పుడో నిర్మించిన  అంబేడ్క‌ర్ భ‌వ‌న్‌ను అదే రోజు ద‌ళిత సంఘానికి అంకితం చేస్తున్న‌ట్లు కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం మ‌రింత విడ్డూరంగా ఉంద‌ని స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.