పెద్దాపురంలో వైసీపీకి దూరమవుతున్న దళితులు

పెద్దాపురం: దళితులకు నిత్యం అండగా ఉండే వైఎస్సార్ సీపీకే నేడు దళితులు దూరమవుతున్న పరిస్థితులు పెద్దాపురం నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్నాయి. దీనంతటికీ ఆ నియోజకవర్గంలో పార్టీ బాధ్యులుగా ఉన్నవారే కారణమని పలు దళిత సంఘాల నాయకులతోపాటు మరికొంతమంది సామాజిక నాయకులు పేర్కొంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ బాధ్యులు దళిత సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం, దళిత వాడలను పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళితులపై దాడులు జరుగుతున్నా స్పందించకపోవడం, అదే పార్టీకి చెందిన నాయకులు దళితులపై దాడులు చేసినా ఖండించకుండా వెనుకేసుకునిరావడంతో దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇటీవల సామర్లకోటలో ఓ దళిత యువకుడి మరణానికి కారణమైన కొంతమందిని కాపాడేందుకు నియోజకవర్గ బాధ్యులు శతవిధాలా ప్రయత్నాలు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే పదేళ్లుగా వైఎస్సార్ సీపీ జెండాను మోసిన దళిత నాయకులు, సొంత పార్టీ కార్యకర్తలపైనే ఎన్నికల ముందు పార్టీలో చేరిన వ్యక్తి తమపై తప్పుడు కేసులను బనాయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే దళితుల పక్షాన నిలబడేవారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.

Share this on your social network: