అఖిలపక్ష భేటీలో వైసీపీ డిమాండ్
Published: 17-06-2019

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని గతంలో రాజ్యసభలో ఇచ్చిన హామీని అఖిల పక్ష సమావేశంలో ప్రస్తావించినట్లు వైసీపీపీ నాయకుడు విజయసాయిరెడ్డి తెలిపారు. పార్లమెంటు సమావేశాలను పురస్కరించుకుని ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారమిక్కడ జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామన్న హామీ నెరవేర్చాలని ప్రధానిని కోరామన్నారు. వెనుకబడిన తరగతులకు వారి జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు అవసరమైతే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌ను సవరించాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇదివరకే ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయాన్ని కూడా తాను గుర్తు చేశానన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కూడా డిమాండ్ చేసినట్లు చెప్పారు. పార్లమెంటు సజావుగా జరిగేందుకు తమ పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. సమావేశాలకు ఎవరైనా అవరోధం కల్పిస్తే ఆ సభ్యుల జీతాలను నిలిపివేయాలని ఆయన సూచించారు. సభకు నిరంతరం ఆటంకం కల్పించడాన్ని అడ్డుకోవడానికి చట్టాన్ని తీసుకురావలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమ పార్టీ మోదీ ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతిస్తుందన్నారు. ప్రత్యేక హోదాయే తమ ప్రధాన డిమాండ్‌గా స్పష్టం చేశారు. వైసీపీకి లోక్‌సభ స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చే విషయంపై ప్రభుత్వంతో తామెలాంటి చర్చా జరపలేదని విజయసాయి చెప్పారు.

Share this on your social network: