బాబుకు ఓట్లేస్తే.. మరో ఐదేళ్లు నరకమే

Published: 23-01-2019
సీఎం చంద్రబాబు ప్రకటించిన తాయిలాలు చూసి ఓట్లు వేస్తే మరో ఐదేళ్లు ప్రజలు నరకయాతన పడాల్సి వస్తుందని మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. సంక్షేమం అంటే ఎన్టీఆర్‌, వైఎ్‌సఆర్‌లు అమలు చేసినవని తెలిపారు. రాబోవు ఎన్నికల్లో ఓట్ల కోసమే చంద్రబాబు వరాలజల్లు కురిపిస్తున్నారని విమర్శించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాలుగా చంద్రబాబు తన సొంత ఎజెండా, ఈ ఆరు నెలలు ప్రజల అజెండా అమలు చేస్తున్నారని తెలిపారు.
 
 
ప్రతిపక్ష నాయకుడిని ఆషామాషీగా తీసుకున్నారని తీరా ఎన్నికల సమయం ఆసన్నమైనప్పుడు వెన్నులో వణుకుపుట్టి అన్ని అస్ర్తాలు ఉపద్రవంలా అమలు చేస్తున్నారని చెప్పారు. అసలు సంక్షేమం అన్న పథకానికి అర్థం తెలుసా అని ప్రశ్నించారు. పరిజ్ఞానం ఉన్న రాజకీయ వేత్తకు ఉండాల్సిన లక్షణాలు బాబుకు లేవని, 2014లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదని తెలిపారు. ఓట్ల కోసం అవసరాన్ని బట్టి రూపొందించిన సంక్షేమం తప్ప ప్రజలకు ఉపయోగపడే పథకాలు కావని చెప్పారు. రెండు వేల కోట్ల అప్పుల్లో రాష్ట్రం ఉందని, ప్రజలకు ఏం జవాబు చెబుతావని ప్రశ్నించారు. వ్యక్తిగత లబ్ధి కోసం ప్రజలను, పార్టీని మోసం చేయడం సరికాదని సూచించారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి తుమ్మలకుంట శివశంకర్‌, రాష్ట్ర నాయకులు వినోద్‌కుమార్‌, జిల్లా నాయకులు కరీముల్లా పాల్గొన్నారు.