తాజా రాజకీయ పరిణామాలపై వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు...

Published: 05-12-2018
విజయవాడ: తాజా రాజకీయ పరిణామాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఈ ధోరణి ప్రమాదకరమన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్లు ఆలస్యం చేయడం సరికాదని తెలిపారు. సభ్యులపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వెంకయ్య అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఎన్నికల కేసులను త్వరగా పరిష్కరించాలని, ఆర్థిక నేరగాళ్లు దేశం దాటకుండా చర్యలు తీసుకోవాలని వెంకయ్య తెలిపారు.
 
ఎన్నికల సమయంలో ఇస్తున్న హామీలు విచిత్రంగా ఉంటున్నాయన్నారు. అమలు సాధ్యంకాని హామీలు ఇవ్వడంపై రాజకీయ పార్టీలు ఆలోచించాలని సూచించారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా హామీలు గుప్పిస్తున్నారన్నారు. కులం, మతం, ధనంతో సంబంధం లేకుండా ప్రజలు ఓట్లు వేయాలని వెంకయ్య పిలుపునిచ్చారు. అభ్యర్థి గుణం, సామర్థ్యాన్ని ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఆరోగ్యకరమైన అభివృద్ధి అవసరమని...అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.