రోడ్డు ప్రమాదంలో తెగిపడిన కాలు
Published: Thursday November 22, 2018

ఆర్టీసీ బస్సు మోటర్ బైక్‌ను ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మండల పరిధిలోని సున్నంపాడు గ్రామం సమీపంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. హెల్త్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బి.యోహాన్, అతడి స్నేహితుడు జె.లోవరాజు మోటారు బైక్‌పై రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వైపు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. సున్నంపాడు సమీపంలోని ప్రమాదకర మలుపు వద్దకు రాగానే కాకినాడ-భద్రాచలం ఆర్టీసీ ఆల్ట్రాడీలక్స్ బస్సు వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో యోహాన్ కాలు తెగిపడింది. లోవరాజుకు తలపై బలమయిన గాయమయింది.
క్షతగాత్రులను 108లో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో కాకికాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై మారేడుమిల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యోహాన్ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాడు. యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ జిల్లా కార్యదర్శిగా ఉన్నాడు. లోవరాజు అడ్డతీగల మండలం చిన మునకానగడ్డ గ్రామానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు.
