డీజిల్ కొట్టించి బిల్లు తెస్తే ఆ డబ్బులను చెల్లిస్తామని పీవో తెలపడంపై గిరిజనుల ఆవేదన
Published: Monday November 19, 2018

గర్భిణికి నెలలు నిండకుండా అధిక రక్తస్రావం కావడంతో ప్రమాద స్థితికి చేరుకుంది. దీంతో ఆమెను కుటుంబీకులు నేలజర్త నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధారకొండ పీహెచ్‌సీకి తమ సొంత ఖర్చులతో తీసుకొచ్చారు. అక్కడి నుంచి అత్యవసర వైద్యసేవలందించడానికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్‌కు డీజిల్ లేదు. డీజిల్ పోసుకుంటే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తీసుకెళతామని పీహెచ్సీ సిబ్బంది తెలపడంతో గర్భిణీ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర రోగిని వైద్యం కోసం తరలించకుండా డీజిల్ లేదని చెప్పడం ఎంతవరకూ సమంజసమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీకేవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ నేలజర్త గ్రామానికి చెందిన సుంకరి పార్వతికి మొదటి కాన్పు. ప్రసవానికి ఇంకా నెల రోజుల సమయం ఉండగానే ఆదివారం అధిక రక్తస్రావం కావడంతో ప్రమాదకరస్థితికి చేరుకుంది. దీంతో నేలజర్త ఏఎన్ఎం ఒక ప్రైవేటు వాహనంలో ధారకొండ పీహెచ్‌సీకి తరలించింది. గర్భిణి పరిస్థితి విషమంగా ఉండడంతో ఈమెను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించాలని సిబ్బంది సూచించారు. ఆమెను తరలించడానికి అంబులెన్స్‌లో డీజిల్ లేదని, మూడు నెలలు అంబులెన్స్‌కు బిల్లులు చెల్లించలేదని, ఎవరైనా అత్యవసర రోగులు ఉంటే వారి డబ్బులతోనే తీసుకెళుతున్నామన్నారు. అంబులెన్స్‌కు డీజిల్ లేకపోవడంపై స్థానిక నాయకుడు సుంకర విష్ణుమూర్తి పీవో దృష్టికి తీసుకెళ్లగా మూడు నెలలుగా బిల్లులు చెల్లించని మాట వాస్తవమేనన్నారు, మీ సొంత డబ్బులతో డీజిల్ కొట్టించి బిల్లు తెస్తే ఆ డబ్బులను చెల్లిస్తామని పీవో తెలిపారని, అత్యవసర వాహనానికి డీజీల్ బిల్లులు కూడా చెల్లించకపోవడమేమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
