రాత్రి గదికి పిలిచి లైంగిక వేధింపులు

ఇంటర్ చదువుతూ, హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులపట్ల అసభ్యంగా ప్రవర్తించి, వారిని లైంగికంగా వేధిస్తున్న ఒక ప్రైవేటు కళాశాల ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం కోర్టులో హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్ విధించారు. వివరాల్లోకి వెళితే... ఎలమంచిలి రైల్వే స్టేషన్ రోడ్డులో గీతాంజలి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ‘గీతాంజలి డిగ్రీ అండ్ ఇంటర్ కళాశాల’ను నిర్వహిస్తున్నారు. వ్యవస్థాపకుల్లో ఒకరైన పీవీఎస్ ఈశ్వరదత్తు ఈ కాలేజీ ప్రిన్సిపాల్, కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. ఈనెల 12న రాత్రి ఇంటర్ విద్యార్థినులను తన గదికి పిలిపించుకున్న ఈశ్వరదత్తు వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వారిని లైంగికంగా వేధించాడు. దీంతో విద్యార్థినులు విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. వారు బుధవారం అతనిపై ఎలమంచిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రిన్సిపాల్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్ధారించుకుని అతన్ని 354, 354డి, పోక్సో 8, 12 సెక్షన్ల కింద అరెస్టు చేశారు.
