గజదొంగ దున్న కృష్ణ అరెస్టు..
Published: Saturday December 08, 2018

నగరంలో సంచలనం సృష్టించిన పలు చోరీ కేసుల్లో నిందితుడు దున్న కృష్ణను విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. ముడసర్లోవ పరిసరాల్లో కృష్ణను, అతని స్నేహితుడు చింతాడ సారధిని అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. చోరీల్లో కృష్ణకు సహకరించిన బొబ్బిలికి చెందిన అబ్దుల్ రషీద్ (తాళాలు రిపేర్ చేసేవాడు), ముడగ రమణ (చెప్పుల షాప్ యజమాని), దొంగిలించిన సొత్తు కొనుగోలు చేసిన కింతలి గోపాలకృష్ణ (దుస్తుల వ్యాపారి), జామి రితేష్ (బంగారం షాప్ యజమాని), పుసర్ల శ్రీనివాసరావు (బంగారం షాప్ యజమాని)లను కూడా అరెస్టు చేసి సుమారు రూ.40,77,750 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా విలేఖరులకు వివరించారు.
నగరంలోని కంచరపాలెం ప్రాంతానికి చెందిన దున్న కృష్ణ 19వ ఏట నుంచి చిన్న చిన్న దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. కొన్నేళ్ల కిందట సుమారు 150 చోరీ కేసుల్లో మూడేళ్లపాటు జైలు శిక్ష అనుభవించి ఏడాది కిందట రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చాడు. విడుదలైన తరువాత విజయనగరం జిల్లా బొబ్బిలిలో నివాసం వుంటూ విశాఖపట్నంతోపాటు విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్నాడు. ఏడాదికాలంలో 38 చోట్ల దొంగతనాలు చేసిన కృష్ణ 1135 గ్రాములు బంగారం, 5.175 కిలోల వెండి, రూ.1.88 లక్షల నగదు, ఒక ఎల్ఈడీ టీవీ, రాడో వాచ్ ఒకటి, టైటాన్ వాచ్ ఒకటి, సూట్ కేసు ఒకటి, మోటార్ సైకిల్ ఒకటి అపహరించాడు. అతనిపై ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో 25, ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో 6, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, మూడో పట్టణ పోలీస్ స్టేషన్, ఎయిర్పోర్ట్, ఆరిలోవ, శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.
కృష్ణ సెల్‌ఫోన్ వాడకపోవడం, నగరానికి దూరంగా వుంటూ రాత్రివేళల్లో వచ్చి పని ముగించుకుని వెళ్లిపోవడంతో పట్టుకోవడం ఒకింత కష్టమయ్యిందని సీపీ మహేష్‌చంద్ర లడ్డా తెలిపారు. ఈ నేపథ్యంలో 33 మంది సిబ్బంది మూడున్నర నెలలపాటు శ్రమించి అనేక ప్రాంతాలు తిరిగి కృష్ణను పట్టుకున్నట్టు వివరించారు. రాత్రి సమయంలో నగరానికి వచ్చి తాళం వేసి వున్న ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడడంలో కృష్ణ ఆరితేరాడన్నారు. గతంలో ఒకసారి నైట్‌బీట్‌లో వున్న కానిస్టేబుల్‌కు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడన్నారు. చోరీ సొత్తు మొత్తాన్ని రికవరీ చేశామన్నారు. బయట వుంటే దొంగతనాలు కొనిసాగించే అవకాశం వున్నందున ఎక్కువకాలం జైలులోనే వుంచేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తిని ప్రత్యేకంగా కోరనున్నట్టు పోలీస్ కమిషనర్ తెలిపారు. దున్న కృష్ణను పట్టుకున్న పోలీసుల బృందాన్ని ఈ సందర్భంగా సీపీ అభినందించారు.
