జగన్‌పై పవన్ కల్యాణ్ ధ్వజం
Published: Thursday November 29, 2018

ముఖ్యమంత్రి అయితే తప్ప వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ప్రజాసమస్యలు పట్టవా అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిలదీశారు. పాదయాత్రల పేరుతో బుగ్గలు నిమరడం, కురులు సదరడం, సెల్ఫీలు దిగడం తప్ప మరేమీ ఆయన చేతకావని విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎదుర్కోవల్సిన ప్రతిపక్ష నేత తమ ఎమ్మెల్యేలతో కలిసి పలాయనం కావడంతో సీఎం చంద్రబాబు, లోకేశ్‌ల దోపిడీ రాజ్యానికి అడ్డూఅదుపూ లేకుండా పోయిందని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని మలికిపురంలో బుధవారం రాత్రి 9.30కి జరిగిన బహిరంగసభలో పవన్ మాట్లాడారు.
కోనసీమ గ్యాస్‌ను రిలయన్స్, జీఎస్‌పీసీ దోచుకుంటున్నాయని ఆరోపించారు. ‘దక్షిణ భారత ఆస్తుల్ని ఉత్తరాదికి దోచుకెళ్తుంటే వేర్పాటు ఉద్యమాలు వస్తాయని 2014లో ప్రధాని కాకముందు మోదీకి గాంధీనగర్‌లో చెప్పాను. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల నుంచి దక్షిణ భారత నినాదం వస్తుందన్నాను. కానీ ఆయన ప్రధాని కాగానే అవన్నీ మరిచారు. చమురు కంపెనీలు కార్పొరేట్ బాధ్యత కొద్దిమంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇస్తే సరిపోతుందా..? మాకు చేవలేక కాదు.. దేశ సమగ్రతను కోరుకునేవాళ్లం. భరతమాత విచ్ఛిన్నం కాకూడదని కోరుకునేవాళ్లం.
బీజేపీ హిందువుల పార్టీ కాదు.. హిందీ వాళ్ల పార్టీ.. జాతీయ భాషను గౌరవిస్తాను కానీ నా తెలుగు నేను చంపుకోను. హిందీ మామీద రుద్దుతామంటే ఎలా’ అని విమర్శించారు. వేష భాషల కారణంగానే ఆంధ్ర రాష్ట్రాన్ని రెండుగా విభజించారని చెప్పారు. అమరావతిలో పర్యాటక అభివృద్ధి పేరిట రూ.400 కోట్లు వెచ్చించి స్పీడ్‌బోట్ల పోటీలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అప్పులు ఇస్తామంటే చంద్రబాబు ఏనుగులను కొనడానికైనా సిద్ధపడతారని ఆరోపించారు. పంచాయతీ సభ్యుడు కూడా కాలేని పంచాయతీరాజ్ మంత్రి లోకేశ్ కోనసీమలో సైకిల్‌యాత్ర చేయగలరా అని సవాల్ విసిరారు. పట్టుమని పది కిలోమీటర్లు కూడా తొక్కలేని లోకేశ్‌కు ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఎలా తెలుస్తాయన్నారు.
