రోడ్డున పడ్డ వేలాది చేప పిల్లలు
Published: Monday November 19, 2018

నీటిలో ఉండాల్సిన చేప పిల్లలు రోడ్డుమీదకొచ్చాయి. రోడ్డంతా పరుచుకున్న ఆ చేప పిల్లలను స్థానికులు ఎంచక్కా పట్టుకుపోయారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం వేలాది చేపపిల్లలకు శాపంగా మారింది. భువనేశ్వర్ నుంచి విశాఖపట్నానికి చేప పిల్లలను లారీలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి సమీపంలో ఈ లారీ ప్రమాదానికి గురైంది. మార్కెట్ యార్డు వద్ద ఈ లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసి.. వాహనాన్ని నిలిపివేయడంతో.. వెనుక నుంచి వస్తున్న మరో లారీ బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో చేప పిల్లలు మొత్తం రోడ్డుపాలయ్యాయి. వీటిని స్థానికులు వాటిని తీసుకుని వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో వెనుక నుంచి ఢీ కొట్టిన లారీ డ్రైవర్ శామ్యూల్ ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. చేపల పిల్లలను తరలిస్తున్న లారీ డ్రైవర్, క్లీనర్ ప్రమాదం జరిగిన వెంటనే పరారయ్యారు.
