ఇండియా అంటేనే వ్యాపారం

దావోస్ సదస్సులో అంతర్జాతీయ పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు భారత్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా అంతర్జాతీయ కంపెనీల సిఇఒలతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ‘‘ఇండియా అంటేనే వ్యాపారం’’ అనే అంశంపై మాట్లాడుతూ, గత కొద్ది సంవత్సరాల్లో ఆర్థిక రంగంలో భారత్ సాధించిన విజయాల గురించి ఆయన వివరించారు. ప్రధానితో పాటు సిఇఒల సమావేశానికి కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న విజయ్ గోఖలే, విదేశాంగ శాఖ కార్యదర్శి జై శంకర్, డిఐపిపి సెక్రటరీ రమేష్ అభిషేక్ హాజరయ్యారు. బహుళ జాతి కంపెనీలు, విదేశీ కంపెనీలకు చెందిన 40 మంది సిఇఒలు, దేశీయ కంపెనీలకు చెందిన మరో 20 మంది సిఇఒలు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ట్వీట్ చేశారు. ప్రధాని ప్రసంగంతో సభకు హాజరైనవారు ముగ్దులయ్యారని ఆయన పేర్కొన్నారు. దేశ ఆర్థిక రంగాన్ని అనూహ్యంగా మార్చివేయడంలో 130 కోట్ల మంది భారత ప్రజలు సాధించిన విజయాలను మోదీ వివరిస్తున్నప్పుడు యావత్ ప్రపంచం హర్షం వ్యక్తం చేసిందని ట్వీట్ చేశారు. దావోస్ సమావేశాల సందర్భంగా ప్రధాని పలువురు దేశాధినేతలతోనూ బడా పారిశ్రామికవేత్తలతోనూ ముఖాముఖి మాట్లాడారు.
చేతులు కలిపితే సాధిస్తాం..
దావోస్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ దేశీయ సిఇఒలతోనూ విడిగా భేటీ అయ్యారు. దావోస్ సదస్సు నుంచి భారత్ పూర్తి స్థాయిలో లబ్ది పొందాలంటే ఏకతాటిపై ఉండి అవకాశాలను కొల్లగొట్టాలన్న వ్యూహంతో మోదీ భారత్ సిఇఒలను కలుపుకొని ముందుకు కదిలారు. భారత్ విజయాలను, భారత్‌లో ఉన్న అవకాశాలను ఉమ్మడిగానే దావోస్ వేదికలో చాటారు. రాహుల్ బజాజ్, ఆనంద్ మహీంద్రా, చందా కొచ్చార్, ఉదయ్ కోటక్, నరేష్ గోయల్, ఎన్ చంద్రశేఖరన్, సునీల్ మిట్టల్, రవి రుయా, చంద్రజిత్ బెనర్జీ ప్రధానితో పాటే ఉన్నారు. ఈ వివరాలను ప్రభుత్వ ప్రతినిధులు ట్వీట్ చేశారు.
