వ్యవసాయం పండుగ కావాలి
Published: Thursday November 15, 2018

వ్యవసాయం రైతులకు పండగ కావాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. రానున్న ఎన్నికల్లో రైతు పాలన వస్తుందని చెప్పారు. రైతులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటలకు విజయనగరం జిల్లా సీతానగరం మండలం తామరఖండి వద్ద ఆయన తన పాదయాత్ర ప్రారంభించారు. ఎక్కడా బహిరంగ సభలు నిర్వహించలేదు. ప్రజలను పలుకరిస్తూ ముందుకు సాగారు. అప్పయ్యపేట వద్ద వరిచేను కోస్తున్న రైతులు తమ సమస్యలను జగన్‌కు వివరించారు. వర్షాల్లేక వరిపంట తీవ్రంగా నష్టపోయామని.. మద్దతు ధర కల్పించాలని కోరారు. కరువు మండలాల జాబితాలో చోటుదక్కేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.. లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగారం చెరకు బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వినతిపత్రం అందించారు. వందేళ్ల కింద సువర్ణముఖి నదిపై నిర్మితమైన వంతెన శిథిలావస్థకు చేరుకుందని.. దాని స్థానంలో కొత్త వంతెన నిర్మించాలని స్థానికులు కోరారు.
బలిజిపేట మండలం పెదపెంకిలో సుమారు 50 మంది ఫైలేరియా వ్యాధి సోకి బాధపడుతున్నామని, పిల్లలకు కూడా ఈ వ్యాధి సోకడం వల్ల చదువులకు దూరమవుతున్నారని స్థానికులు వినతిపత్రం అందించారు. ఇలా దారి పొడవునా వినతులు స్వీకరించిన జగన్.. అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చినభోగిల, సీతానగరం, అప్పయ్యపేట, జోగింపేట, గుచ్చిమి గ్రామాల మీదుగా మరిపివలస వరకూ ఆయన నడిచారు. జగన్ వెంట వైసీపీ నేతలు మజ్జి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు, ఉదయభాను, జె.ప్రసన్నకుమార్, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
