జగన్‌ యాత్రకు భారీ భద్రత ఇద్దరు డీఎస్పీలు, 150 మంది పోలీసులు

Published: Tuesday November 13, 2018
విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి... ఆ తర్వాత మొదలైన రాజకీయ రగడ నేపథ్యంలో విపక్ష నేత జగన్‌ పాదయాత్రకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఎస్పీలను, 150 మంది వివిధ స్థాయి పోలీసు సిబ్బందిని మోహరించారు. పార్వతీపురం ఇన్‌చార్జ్‌ ఏఎస్పీ గౌతమీశాలి బందోబస్తును పర్యవేక్షించారు. సోమవారం ఉదయం 9 గంటలకు విజయనగరం జిల్లా సాలూ రు నియోజకవర్గంలోని మక్కువ మండలంలో జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభమైంది. గతంలో అభిమానులు జగన్‌ను చుట్టుముట్టడం, స్వేచ్ఛగా సెల్ఫీలు దిగడం వంటివి కనిపించేవి. ఇప్పుడు... అవన్నీ బంద్‌! జగన్‌ చుట్టూ పోలీసులతో ఒక రోప్‌ పార్టీని ఏర్పాటు చేశారు.
 
పాదయాత్రలో పాల్గొనే వీఐపీలకు నీలం రంగు, బందోబస్తులో ఉన్న పోలీసులకు, మీడియా సిబ్బందికి ఎరుపురంగు కార్డులు జారీ చేశారు. వాటిపై ఫొటో, పేరు, వృత్తి వంటి వివరాలు నమోదు చేశారు. ఇక... జగన్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బందికి తెలుపు రంగు కార్డులు అంతకుముందే ఇచ్చారు. ఇదివరకు జగన్‌ను సమీపించి, ఆయన వెనుకే నడిచే అవకాశం ఉండేది. ఇప్పుడు... సామాన్యులు రోప్‌ పార్టీని దాటి లోపలికి వచ్చే అవకాశం లేదు. లోపలికి మహిళలను మాత్రమే, అది కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని అనుమతిస్తున్నారు. బాడీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలతో కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. పాదయాత్ర మార్గాన్ని బాంబ్‌స్క్వాడ్‌తో తనిఖీ చేయిస్తున్నారు.
 
అందరి ఆశీస్సులతో...
అందరి ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్‌ ప్రకటించారు. ఏ ఒక్కరూ అధైర్యపడవద్దని చెప్పారు. పాదయాత్రలో దారిపొడవునా మహిళలను పలకరిస్తూ, వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకుంటూ ముందుకు నడిచారు. కొయ్యానపేట వరకు ఆరు కిలోమీటర్లు నడిచారు. అనంతరం జగన్‌ అక్కడి శిబిరంలో బసచేశారు.
 
వైసీపీలో చేరికలు
రాజమండ్రి వైసీపీ కోఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో రాజమండ్రి నగరానికి చెందిన ఏపీ బీసీజేఎసీ చైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావు, ఆయన తనయుడు, యువ హీరో మార్గాని భరత్‌రావు జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు.