నయం కావడానికి మరో ఆరు వారాలు పడుతుంది

వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు భుజానికి చిన్న గాయమే అయ్యిందని హైదరాబాద్ వైద్యులు స్పష్టం చేశారు. విశాఖపట్నం డాక్టర్లు చెప్పిన విషయాన్నే సిటీ న్యూరో సెంటర్ రాతపూర్వకంగా ధ్రువీకరించింది. జగన్‌కు ఎడమ భుజంపైన వెనుక భాగంలో కత్తి గాయం అయిందని, అది గ్రీవియస్ (తీవ్రమైంది) కాదని డాక్టర్ బీఎస్ శివారెడ్డి పేర్కొన్నారు. కాగా, జగన్ భుజానికి అయిన కత్తి గాయంలో ఎలాంటి విష పదార్థాలు లేవని సిటీ న్యూరో సెంటర్ వైద్యులు ప్రకటించారు. డాక్టర్ శివారెడ్డి బృందం మంగళవారం లోటస్ పాండ్‌లో జగన్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించింది. గాయం ఇంకా తగ్గలేదని, పూర్తిగా నయం కావడానికి మరో ఆరు వారాలు పడుతుందని డాక్టర్ శివారెడ్డి చెప్పారు. పాదయాత్రకు వెళ్లాలనే అభిప్రాయంతో జగన్ ఉన్నారని, కొన్ని జాగ్రత్తలతో పాదయాత్ర కొనసాగించవచ్చని సూచించినట్లు చెప్పారు. జగన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, బీపీ నియంత్రణలో ఉందని వివరించారు.
