ఈ ఎడాదిలోనే ఎన్నికలా?

ఈ ఏడాది డిసెంబర్ నెలలోనే లోక్‌సభకు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపితే మేలని బీజేపీలో జోరుగా అంతర్మథనం సాగుతోంది.మామూలుగా అయితే సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్-మేల్లో జరగాల్సి ఉంది. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకూ అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. మరో మూడు పెద్ద రాష్ట్రాలు- రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల కాలపరిమితి 2019 జనవరిలో ముగుస్తుంది. ఇక సిక్కిం అసెంబ్లీ పదవీకాలం 2019 మేలోను, అరుణాచల్ ప్రదేశ్‌ది జూన్ 1న పూర్తవుతుంది. ఈ రీత్యా లోక్‌సభ ఎన్నికలను ఏపీ, తెలంగాణ, ఒడిశా, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలనూ ఓ నాలుగైదు నెలలు ముందుకు జరిపి మొత్తం ఎనిమిది రాష్ట్రాలకూ ఒకేసారి ఎన్నికలు జరిపిస్తే తమకు రాజకీయంగా బాగుంటుందన్న విషయంపై బీజేపీలో చర్చలు సాగుతున్నాయి.
జమిలీ ఎన్నికలు వీలవకపోతే నవంబరులో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఇవి మూడూ బీజేపీ పాలిత రాష్ట్రాలు. రాజకీయంగా ఆ పార్టీకి అత్యంత కీలకం. ఒకవేళ నవంబరులో ఈ మూడింటికే గనుక అసెంబ్లీ ఎన్నికలు జరిగి ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఆ దెబ్బ లోక్‌సభ ఎన్నికలపై కచ్చితంగా పడుతుంది. అసలే ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటున్న ఈ మూడు రాష్ట్రాల సర్కార్లు విజయం కోసం గట్టి ప్రయత్నమే చేయాలి. ప్రతిపక్షాలు ఇప్పటికే ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలనూ సెమీ ఫైనల్స్ అని తేల్చాయి. ఈ దృష్ట్యా జమిలీకి వెళితే- చాలా వరకూ ఈ వ్యతిరేకతను తట్టుకోవచ్చన్నది కమలనాథుల ఊహ. అయితే విపక్షాలు జమిలీ ఎన్నికలకు ససేమిరా అంటున్నాయి. కాలావధి పూర్తికాకుండా ఎన్నికలు నిర్వహించడం తమకు సమ్మతం కాదని-కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం స్పష్టం చేశాయి. ‘‘ఎన్నికల వ్యయం తగ్గించడానికి జమిలీ బెటరని మోదీ బయటకు అంటున్నప్పటికీ ఆయనదంతా రాజకీయ ఎత్తుగడే. ప్రభుత్వ వ్యతిరేకత వెల్లువలా ఉన్నపుడు ఇలాంటి ఆలోచనలే వస్తాయి. అదీ కాక- వేసవిలో నిర్వహిస్తే తమ ప్రభుత్వ వైఫల్యాలు మరింతగా బయటపడతాయన్నది ఆయన భయం’’ అని సోమవారం నాడు సిబ్బంది, వ్యవహారాలు, న్యాయ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం విపక్ష నేతలు వ్యాఖ్యానించారు.
నిజానికి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ, లోక్ సభకూ కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన కేంద్రం చాలాకాలంగా చేస్తోంది. కొన్ని రాష్ట్రాలు ఈ విషయంపై కేంద్రంతో ఏకీభవించినట్లు కూడా సమాచారం. కనీసం పాక్షికంగా నైనా ఈ ఆలోచనను అమలు చేస్తే క్రమంగా 2024 నాటికి అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించేందుకు రంగం సిద్దం చేయవచ్చని బిజెపి భావిస్తోంది.
1951-52లో లోక్ సభకూ, దేశంలోని అన్ని అసెంబ్లీలకూ ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1957, 1962, 1967 ఎన్నికల్లోనూ ఇదే ప్రక్రియను అనుసరించారు. 1970లో లోక్‌సభ రద్దు కావడం, తర్వాత 1977లో లోక్ సభ పదవీకాలాన్ని పొడిగించడంతో అంతా తారుమారయ్యింది. జమిలీ ఎన్నికల నిర్వహణ మంచిదేగానీ- పాక్షికంగానైనా సరే.. డిసెంబరులో జరపడం అసాధ్యమని, 2024 వరకూ కూడా జరపలేమని అంటున్నారు మాజీ సీఈసీ టీఎస్ కృష్ణమూర్తి. ‘‘మనం బ్రిటిష్ తరహా వ్యవస్థను రూపొందించుకున్నాం. అమెరికన్ తరహా వ్యవస్థ అయితే నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. ఎవ్వరినైనా దించేసినా మరొకర్ని ఎన్నుకునే పరిస్థితి అది. ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రభుత్వమైనా కూలిపోతే నిర్దిష్ట కాలావధిలోగా ఎన్నికలు జరుపుతుంటాం.. లోక్‌సభకూ అంతే. జమిలీ తెస్తే ఇలా కుదురుతుందా? ఇలా కుదరాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. 2024లో కానీ అది వీలుపడదు’’ అని ఆయన హైదరాబాద్‌లో అన్నారు.
