ప్రపంచంలోనే ఎత్తైన సచివాలయం
Published: Monday October 29, 2018

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 212 మీటర్ల ఎత్తుతో(695 అడుగులు) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సచివాలయ నిర్మాణం చేపట్టి చరిత్ర సృష్టిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. 41 ఎకరాల్లో నిర్మించే ఈ సచివాలయం దేశంలోనే తొలి డయాగ్రిడ్ భవనం కావడం విశేషమని, అలాగే మొదటిసారిగా ట్విన్ లిఫ్ట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏపీసీఆర్డీయే, ఏడీసీ అధికారులతో ముఖ్యమంత్రి ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మౌలిక వసతుల కల్పనలోనూ అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ‘ప్రతి సవాలు మనల్ని మరింత దృఢం గా చేస్తుంది. అనేక ఇబ్బందులు, కష్టాల మధ్య మూడేళ్ల కిందట ప్రయాణాన్ని ప్రారంభించాం. ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలని నిర్ణయించాం. అతితక్కువ సమయంలోనే తాత్కాలిక పరిపాలనా భవనం, అసెంబ్లీని నిర్మించుకొని చరిత్ర సృష్టించాం’ అని చంద్రబాబు వివరించారు.
వచ్చే ఏడాది కల్లా అమరావతి ప్రభుత్వ భవన సముదాయ నిర్మాణం కూడా ఒక రూపునకు వస్తుందన్నారు. ‘మన కష్టాన్ని, నిబద్ధతను, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు గుర్తించారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ పెట్టుబడులకు అమరావతిని ఎంచుకొంటున్నారు. మన సర్కార్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనం. ఈ ఫలాలలను ప్రజలందరికీ అందించడమే మన కర్తవ్యం. సమీప భవిష్యత్‌లో అమరావతిలో జనాభాతోపాటు ఆర్థిక వృద్ధి గణనీయంగా ఉంటుంది’ అని సీఎం పేర్కొన్నారు. శాశ్వత సచివాలయ, శాసనసభ, హైకోర్టు భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యే గడువులను తెలియజేస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని చంద్రబాబు ఆదేశించారు. అమరావతి అభివృద్ధితో కలిగే ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్రంలోని ప్రతిఒక్కరికీ అందేలా సీఆర్డీయే చర్యలు తీసుకొన్నట్లు మంత్రి నారాయణ చెప్పారు.
శరవేగంగా పనులు
రూ.14,360 కోట్లతో చేపట్టిన రోడ్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, రూ.4890 కోట్లతో మొదలుపెట్టిన సచివాలయం, హైకోర్టు భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సీఆర్డీయే సీఈవో అజయ్‌జైన్ వివరించారు. కీలక పెట్టుబడి అవకాశాలను కూడా సీఆర్డీయే గుర్తించిందన్నారు. 2019 సెప్టెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించామని వివరించారు.
