విరాట్ కోహ్లీ ట్వీట్‌పై స్పందించిన సీఎం
Published: Wednesday October 24, 2018

విశాఖ నగరం అద్భుతమైన ప్రదేశమని, ఇక్కడికి రావడం తనకెంతో ఇష్టమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్‌కు సీఎం చంద్రబాబు స్పందించారు. విశాఖ నగరం ప్రపంచం ప్రేమించే గమ్యస్థానం అవుతున్నందుకు సంతోషంగా ఉందని చంద్రబాబు చెప్పారు. విశాఖలో నేడు జరగనున్న భారత్-వెస్టిండీస్ రెండో వన్డేలో కోహ్లీ సేన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ట్విట్టర్‌లో సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు.
వెస్టిండీస్‌తో రెండో వన్డే కోసం కోహ్లీ సేన విశాఖపట్టణం చేరుకున్న విషయం తెలిసిందే. సరిగ్గా పది నెలల తర్వాత విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌తో స్థానికంగా సందడి మొదలైంది. ఏసీఏ-వీడీసీఏ మైదానంలో భారత్ ఏడు మ్యాచ్‌లాడగా ఆరింట్లో నెగ్గింది. 2013లో ఎదురైన ఏకైక ఓటమి విండీస్ పైనే కావడం గమనార్హం. ఈ మైదానంలో టాస్ ఓడిన జట్టు ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌ను కూడా గెలవలేదు.
రాత్రి మంచు ప్రభావం ఉండడంతో టాస్ నెగ్గిన జట్టు ఫీల్డింగ్ తీసుకునే చాన్స్ ఉంది. ఈ పిచ్‌పై మరోసారి పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే వికెట్‌పై పచ్చిక లేకపోవడంతో స్పిన్నర్లూ కీలకమే.. ఇక్కడ అధిక వేడితో పాటు తేమ వాతావరణం ఉన్నా మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
