మొసలి రోడ్డుపైకి వచ్చింది....అన్యాయమైపోయింది

జుపాలెం(గుంటూరు జిల్లా): జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అధికం. ఏటా వందల ప్రాణాలు గాల్లో కలుస్తూ ఉంటాయి. పాపం, ఈ విషయాలు తెలియని మొసలి రోడ్డుపైకి వచ్చింది. గుర్తు తెలియని వాహనం కిందపడి నలిగి చనిపోయింది. మండలంలోని అనుపాలెం గ్రామ సమీపంలో వాగు ఉంది. అందులో ఉండే మొసలి ఉందనీ, సమీప మాగాణి పొలాల్లో సంచరిస్తుంటుందనీ స్థానికులు అనుకునే వారు. అయితే వారెవరూ దాన్ని ఇప్పటివరకు చూడలేదు. శనివారం రాత్రి కూడా బయటకు వచ్చిన మొసలి గుర్తుతెలియని వాహనం కిందపడి మృతి చెందింది. సమాచారం అందుకున్న కోనంకి బీట్ ఆధికారి అమీర్ జానీ బాషా సంఘటన స్థలానికి వచ్చి మొసలి కళేబరాన్ని పరిశీలించారు. బ్రాహ్మణపల్లి పశు వైద్యాధికారి వంశీని పిలిపించి పోస్టుమార్టమ్ అనంతరం దహనం చేశారు. ఏడెనిమిది అడుగుల పొడవున్న ఆ మొసలి వయసు సుమారు మూడేళ్లు ఉండవచ్చని జానీ బాషా చెప్పారు. సంఘటన స్థలం సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మిస్తుండడంతో నిత్యం లారీల రాకపోకలు జరుగుతున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే లారీ లేదా ట్రాక్టర్ కిందపడి మొసలి చనిపోయి ఉంటుందని వారు అంటున్నారు.
