దసరా వెళ్లింది.. సెలవులు ముగిశాయి.
Published: Monday October 22, 2018

జనం జనం.. ఎటుచూసినా జనం.. వాహనాల రద్దీ..! దసరా పండగకు కుటుంబాల సమేతంగా సొం తూళ్లకు వెళ్లిన పట్టణవాసులు తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ చిక్కులు ఎదుర్కొన్నారు. సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. బస్సులు, రైళ్లు కిటకిటలాడగా.. సొంత వాహనాలపై వెళ్లినవారికి జాతీయ రహదారులపై ట్రాఫిక్ కష్టాలు చుక్కలు చూపించాయి.
ఆదివారం విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న టోల్‌గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరాయి. చిల్లర లేకపోవడం తదితర కారణాల వల్ల టోల్ ఫీజు చెల్లింపు ఆలస్యమై వాహనాలు కిలోమీటర్ల మేర చీమల్లా బారులుతీరాయి. బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి ఆదివారం కూడా వేలాదిమంది భవానీ భక్తులు తరలిరావడంతో బస్ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్‌లో రద్దీ మరింత పెరిగింది. కంచికచర్ల మండలం కీసర టోల్‌గేట్ వద్ద గల 4 కౌంటర్లకు అదనంగా మరో కౌంటర్ ఏర్పాటు చేసినా టోల్ రుసుము వసూలులో తీవ్ర జాప్యమైంది.
టోల్‌గేట్ దాటడానికి కనీసం 20 నిమిషాలు పట్టడంతో వాహనచోదకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టోల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దేశంలో ఎక్కడా లేని నిబంధనలు కీసరటోల్ గేట్ వద్ద పాటిస్తున్నారంటూ సినీనటుడు గౌతమ్‌రాజ్ వంటివారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు తెలంగాణలో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ గ్రామ శివారులో గల జీఎమ్మార్ టోల్ ప్లాజాలోని 11 కౌంటర్లలో ఏడు కౌంటర్లను హైదరాబాద్ వైపునకు వెళ్లే వాహనాలకు కేటాయించారు. వాహనాల వేగ నియంత్రణ కోసం చిట్యాలలో రహదారిపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా వందలాదిగా నిలిచిపోయాయి. పంతంగి టోల్‌గేట్ వద్ద 2కి.మీ.ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. 16 గేట్లకు 10గేట్ల ద్వారా వాహనాలను హైదరాబాద్ వైపు మళ్లించారు.
