ఎవరు డబ్బులిస్తే వారి మాటే.. జనసేనానిపై కత్తి మహేశ్ విమర్శలు
Published: Monday October 15, 2018

రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో 500 మంది ఓటర్లను కూడా ప్రభావితం చేయలేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను సినీ, రాజకీయ విమర్శకుడు కత్తి మహేశ్ దుయ్యబట్టారు. 5 వేల నుంచి 6 వేల ఓట్లున్న మనమెందుకు చాలెంజ్ చేయకూడదని మాదిగ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. మాదిగలను పట్టించుకునే వారికే ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మాదిగ రాజకీయ చైతన్య సభకు మహేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎవరు డబ్బులిస్తే వారివైపు మాట్లాడడం పవన్‌కు అలవాటని విమర్శించారు.
ప్రస్తుతం బీజేపీ నాయకులు పవన్‌ను పోషిస్తున్నారని అన్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో ఇది కూడా మారుతుందన్నారు. ‘ఎప్పుడు ఎవరితో జతకడతాడో తెలియదు. తన స్వార్థం కోసమే రాజకీయాల్లోకి వచ్చాడు’ అని విమర్శించారు. రెండుసార్లు సీఎం అయిన చంద్రబాబు మాదిగలను మోసం చేశారని, మాదిగల గురించి మాట్లాడాలంటేనే జగన్ భయపడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తాను చిత్తూరు ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అయితే, వైసీపీ లేదా కాంగ్రెస్ ఎవరు టికెట్ ఇస్తే ఆ పార్టీలో చేరి పోటీ చేస్తానన్నారు.
