మావోయిస్టు మీనా మృతి
Published: Saturday October 13, 2018

లివిటిపుట్టు హత్యలతో రగిలిపోతున్న ఏపీ పోలీసులు.. మావోయిస్టుల వేటలో దూకుడు పెంచారు. రెండు వారాలకుపైగా ఒడిసా పోలీసులతో కలిసి ఏవోబీని జల్లెడ పడుతున్న మన బలగాలకు.. వారం క్రితం దొరికినట్టే దొరికి నక్సల్స్ తప్పించుకొన్నారు. కానీ, శుక్రవారం మాత్రం వారి గురి తప్పలేదు. ఆంధ్ర-ఒడిసా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందింది. మల్కన్‌గిరి జిల్లా ఆండ్రపల్లి-తోటగుడ పరిధిలోని దట్టమైన అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మృతురాలిని ఎన్ ప్రమీల అలియాస్ మీనా అలియాస్ జిలానీ బేగం అలియాస్ శారదగా పోలీసులు గుర్తించారు. మావోయిస్టు డివిజనల్ కమిటీ మెంబర్‌గా కొనసాగుతున్న మీనా.. అరకు టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమల హత్య కేసులో 21వ నిందితురాలని చెబుతున్నారు. మీనా ఏవోబీ కటాఫ్ ఏరియా కమిటీ కార్యదర్శి, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ భార్య. ఆమె స్వస్థలం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా పోచన్నపేట గ్రామం. ఈ ఎన్‌కౌంటర్ నుంచి ఉదయ్ సహా 30 మంది మావోయిస్టులు తప్పించుకున్నట్టు తెలిసింది.
అరకులో టీడీపీ నేతల హత్యలకు పాల్పడిన దళం ఆంధ్రా-ఒడిసా సరిహద్దు గ్రామాల్లోనే తలదాచుకొన్నట్టు ఏపీ పోలీసులకు పక్కా సమాచారం ఉంది. ఈ హత్యలు జరిగిన వారం రోజులకే సరిహద్దుల్లోని కటాఫ్ ఏరియాలో భారీ సభ జరిపి మరోసారి పోలీసులకు మావోయిస్టులు సవాల్ విసిరారు. దీంతో ఒడిసా ప్రత్యేక బలగాలతో కలిసి గ్రేహౌండ్స్ పోలీసులు కూంబింగ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా సాలూరు పరిధిలోని అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఇటీవల భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేతలు పాల్గొన్నట్టు, వారిలో కొందరు గాయపడినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో చేజారిన మావోయిస్టుల కోసం గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఒడిసాలోని మల్కన్‌గిరి జిల్లా రామ్‌గఢ్, ఆండ్రపల్లి, తోటగుడ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు మూడు రోజుల క్రితం సమాచారం అందింది. ఆ సమాచారాన్ని ధ్రువీకరించుకొన్న గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు.. రెండు రోజుల క్రితం పెదబయలు మండలం రూడకోట పోలీస్ అవుట్ పోస్టు మీదుగా ఒడిసా వైపు బయలుదేరి వెళ్లాయి.
గురువారం రాత్రి ఆండ్రపల్లి-తోటగుడ సమీపంలో మావోయిస్టులు బస చేసినట్టు గుర్తించాయి. శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటలకు ఈ ప్రాంతంలో కూంబింగ్ మొదలుపెట్టాయి. ఈ బలగాలకు సుమారు 30 నుంచి 40 మంది మావోయిస్టులు అక్కడ తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయని పోలీసు వర్గాలు తెలిపాయి. రెండుగంటల పాటు జరిగిన ఈ కాల్పులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కాల్పుల అనంతరం సంఘటనా స్థలంలో పరిశీలించగా, ఒక మహిళా మావోయిస్టు మృతదేహం లభ్యమయిందని, ఆమెను మీనాగా గుర్తించామని పోలీసు వర్గాలు తెలిపాయి. ఘటనాస్థలిలో ఒక కార్బన్ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె మృతదేహాన్ని మల్కన్‌గిరి జిల్లా కేంద్రానికి తరలించారు. ఉదయ్ సహా తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఒడిసా ఎస్‌వోజీ, ఏపీ గ్రేహౌండ్స్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ మెదలుపెట్టాయి. ఈ క్రమంలో పోలీసులు నలుగురు మిలీషియా సభ్యులను అదుపులోకి తీసుకుని మల్కన్‌గిరి తరలించినట్టు చెబుతున్నారు.
ఛత్తీ్‌సగఢ్‌లో మహిళా నక్సల్ మృతి
ఛత్తీ్‌సగఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మావోయిస్టు చనిపోయింది. మృతురాలిని కవాసీ దేవాగా గుర్తించారు. సుకుమా జిల్లాలోని తులసి గుట్టల పరిధిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరిపి వెనక్కి వస్తున్న రిజర్వు గార్డు బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగాయని ఆ జిల్లా ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. కాంగేర్ వ్యాలీ ఏరియా కమిటీ మిలీషియా డిప్యూటీ కమాండర్‌గా పనిచేస్తున్న దేవా ఈ కాల్పుల్లో చనిపోయినట్టు ఆయన తెలిపారు.
