బీజేపీ చేతిలో ఇరుక్కుని మనకు షరతులా
Published: Sunday October 07, 2018

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని.. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ తనను కోరారని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. టీఆర్‌ఎస్ పార్టీతో జరిగిన చర్చల ప్రక్రియ వివరాలను శనివారం ఇక్కడ టీడీపీ ఎంపీల సమావేశంలో చంద్రబాబు వివరించారు. ‘తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రాంతీయ పార్టీలు కలిసి ఉంటే దక్షిణాదిలో ఆధిక్యం చూపవచ్చునని, ఢిల్లీలో కూడా తెలుగువారి ప్రాభవానికి ఉపయోగపడుతుందని నేను సూచించాను. ముందు సానుకూలంగానే స్పందించారు. ఆలోచించి చెబుతానన్నారు. కానీ, వారం తర్వాత కలవలేనని చెప్పారు. ఆయనను మరెవరో ప్రభావితం చేస్తున్నారని అప్పుడే అర్ధమైంది. ఆ సమయంలోనే మనకు మరో షరతు పెట్టారు. టీడీపీ పోటీ చేయాలనుకొంటే ఒంటరిగా చేయాలని, కాంగ్రెస్‌తో కలవొద్దని కోరారు. ఆయన బీజేపీ చేతిలో ఇరుక్కొని మనకు షరతులు పెడితే ఎలా? ఆయన దూరంగా ఉంటున్నప్పుడు మన నిర్ణయం మనం తీసుకొంటాం.
తెలంగాణలో తాము చెప్పినట్లు టీడీపీ వింటే ఆంధ్రా రాజకీయాల్లో వేలు పెట్టనని కేసీఆర్ మరో మాట అన్నారు. ఆయన మాట ఎవరు నమ్మాలి? ఈ ఎన్నికలు గడిచిన తర్వాత ఆయన ఎలా వ్యవహరిస్తారో ఎవరైనా చెప్పగలరా? అందుకే అక్కడ మన పార్టీ నిలబడటానికి ఏ వ్యూహం అవసరమో ఆ వ్యూహంలో వెళ్లాం. మనమేమీ నేరుగా కాంగ్రె్‌సతో కలవలేదు. మనవాళ్లు కోదండరాంతో, సీపీఐతో చర్చలు జరిపారు. తర్వాత కాంగ్రెస్ వచ్చింది. అందరూ కలిసి మహా కూటమిగా ఏర్పడ్డారు’ అని చంద్రబాబు వివరించారు. ‘ఇక్కడ జగన్, అక్కడ టీఆర్‌ఎస్ వస్తుందని 2014 ఎన్నికల ముందే కేసీఆర్ చెప్పాడు. ఏపీలో జగన్ వస్తే అతని ముందు తానే సమర్థుడిగా చలామణి కావొచ్చని ఆశించాడు. కానీ ఏపీ ప్రజలు కేసీఆర్ ఆశల్ని తారుమారు చేశారు’ అని అన్నారు.
కేసీఆర్ భాషపై చర్చ
చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్ చేస్తున్న విమర్శలు, వాడుతున్న భాష ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. చేసిన అభివృద్ధిని చెప్పుకొని ప్రజల వద్ద ఓట్లు పొందగలిగే పరిస్థితిలో కేసీఆర్ లేరని, అందుకే ఆంధ్రులను, చంద్రబాబును తిట్టి మరోసారి తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడితే తప్ప గెలవలేనన్న అభిప్రాయంతో ఈ పని చేస్తున్నారని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. ‘ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా మెదక్ జిల్లా రాజకీయాల్లో కరణం రామచంద్రరావుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కేసీఆర్‌ను పట్టించుకొనే వారు కాదు. నేను కేసీఆర్‌కు ప్రాధాన్యం ఇచ్చి ముందుకు తెచ్చాను. నా కేబినెట్‌లో మంత్రిగా అవకాశం ఇచ్చాను. ఆయన నా కింద పనిచేశారు. అయినా నేను ఎప్పుడూ కేసీఆర్‌ను ఆ దృష్టితో చూడలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడూ ఇచ్చాను. ఆయనను నా సహచరుడిగా (కొలీగ్)గా సంబోధించేవాడిని తప్ప తక్కువగా చూడలేదు. కేసీఆర్ ఎలా ఉన్నా... ఎలా మాట్లాడినా నా హుందాతనం నేను నిలుపుకొన్నాను. ఆయన మాట్లాడే భాషను ప్రజలు సమర్ధిస్తారని నేను అనుకోను’ అని చంద్రబాబు అన్నారు.
షెడ్యూల్‌పై కేంద్రం ప్రభావం!
ఎన్నికల షెడ్యూల్ విడుదలలో కేంద్ర ప్రభుత్వ ప్రభావం కొంత ఉందన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. బీజేపీ పరిస్థితి బాగోలేదనే ఎలక్షన్ షెడ్యూల్‌లో రాజస్థాన్ ఎన్నికను చివరకు తెచ్చారని, దీనివల్ల ఆ ఎన్నిక ప్రభావం మిగిలిన రాష్ట్రాలపై పడకుండా చూసుకోగలిగారని ఎంపీలు అన్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాక ముందే షెడ్యూల్ విడుదల కావడంపై ఈ సమావేశంలో కొంత ఆశ్చర్యం వ్యక్తమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం వల్ల ఇక ఏపీ ఎన్నికలు ముందు వస్తాయన్న ఊహాగానాలకు తెర పడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ ఎన్నికలు ఆపి లోక్‌సభ ఎన్నికలు ముందుకు తెస్తారని కొంత ప్రచారం జరిగింది. అది జరిగితే ఏపీ ఎన్నికలు కూడా ముందుకు వచ్చేవి. ఇక ఇప్పుడు ఆ అవకాశం లేదు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్, మే నెలల్లోనే ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి’ అని ఆయన పేర్కొన్నారు
