ఇంట్లోకి దూసుకెళ్లిన 278 చక్రాల భారీ కంటైనర్

విజయవాడ: ఎ.కొండూరు మండలంలోని రామచంద్రాపురం మలుపు వద్ద జాతీయ రహదారిపై 278 చక్రాల భారీ కంటైనర్ లారీ గురువారం ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ కంటైనర్‌లో ఒక యంత్రాన్ని ఎన్టీపీఎస్ విద్యుత్ థర్మల్ కేంద్రానికి తీసుకువెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ఈ వాహనం నిలిచిపోవడం వల్ల విజయవాడ-భద్రాచలం రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు తిరువూరు వైపు నుంచి వచ్చే వాహనాలు రెడ్డిగూడెం వైపు, మైలవరం నుంచి వచ్చే వాహనాలను రెడ్డిగూడెం వైపు మళ్లించారు. రామచంద్రాపురం మలుపు వద్ద ఈ వాహనాన్ని తిప్పేందుకు ముందుగా ప్రణాళిక వేసి మలుపులో ఉన్న పాలసేకరణ కేంద్రం ప్రహరీని, సమీపంలోని వెంకటేశ్వరరెడ్డి ఇంటి ప్రహరీని తొలగించి విద్యుత్ లైన్లు కూడా తప్పించారు. అయినా అదుపు తప్పి పక్కనే గల గృహంలోకి దూసుకెళ్లి వాహనం నిలిచిపోయింది. బాధితులకు పరిహారం చెల్లించి వాహనాన్ని తరలించేందుకు ఎన్టీపీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
