భారతీయ +జగన్+ పవన్ పార్టీ = బీజేపీ
Published: Sunday September 23, 2018

విజయవాడ: బీజేపీ అంటే భారతీయ పార్టీ + జగన్ పార్టీ + పవన్ పార్టీ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. జిల్లా కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నేతలు వైసీపీ, పవన్‌తో కలిసి కలిసి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని తాము సాక్ష్యాలతో సహా చెప్పడం జరిగిందన్నారు. ఇటీవల జరిగిన కాకినాడ సభలో రామ్‌మాధవ్ తెలుగుదేశ మేతర పార్టీలతో కలిసి పని చేస్తామని చెప్పడం తో ఈ విషయం స్పష్టమైందన్నారు.
కన్నా లక్ష్మీనారాయణ, ఐవైఆర్ కృష్ణారావు అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన వైనం ప్రజలు గమనిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి కష్టపడి పని చేస్తుంటే కన్నా విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి రామ్ మాధవ్‌కు లేదన్నారు. బీజేపీ, జగన్, పవన్ పార్టీలకు రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
