తిరుమల కొండమీదే సీఐ రాసలీలలకు..
Published: Wednesday September 19, 2018

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. సిద్ధ తేజమూర్తి చిత్తూరు జిల్లా వాయల్పాడు సీఐగా గత ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆగష్టు 10 నుంచి పీలేరు సర్కిల్‌కు ఇన్స్‌పెక్టర్ లేకపోవడంతో అక్కడ ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వర్తించాడు. ఈ సమయంలోనే పీలేరుకు చెందిన ఓ భార్యాభర్తల కేసులో ఆయన తలదూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎప్పుడో నమోదైన కేసులో తన ఫోన్‌నెంబర్ ఆధారంగా సీఐ తనను స్టేషన్‌కు రప్పించడంతో పాటు అసభ్యంగా వాట్సప్‌లో చాటింగ్ చేసినట్లు బాధితురాలు ఆరోపించారు. రెండు రోజుల కిందట ఫోన్ చేసి తిరుమలకు రావాలని చెప్పినట్లు ఆమె చెబుతున్నారు. నందకం రెస్ట్‌హౌస్‌లో గదిని బుక్ చేశానని సీఐ చెప్పినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు.
నిన్న మహిళా సంఘాలను వెంటబెట్టుకుని తిరుమలకు వచ్చిన బాధితురాలు ఎస్సైని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే చివరి నిమిషంలో విషయం పసిగట్టిన తేజమూర్తి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ విషయంపై బాధితురాలు... తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతిని కలిసేందుకు ప్రయత్నించారు. మరోవైపు విషయం తెలుసుకున్న కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీనివాస్....తేజామూర్తిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మరో మహిళకు ఇలాంటి వేధింపులు ఎదురుకాకూడదని తాను ధైర్యంగా ముందుకు వచ్చానని బాధితురాలు చెబుతోంది.
