కావాలనే మోదీపై దుష్ప్రచారం: కన్నా
Published: Wednesday September 19, 2018

ముఖ్యమంత్రి చంద్రబాబుపై మహారాష్ట్ర న్యాయస్థానంలో ‘కోర్టు ధిక్కార’ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. బాబ్లీ వ్యవహారంలో న్యాయవ్యవస్థను కించపరిచేలా సీఎం వ్యాఖ్యానించారని ఆయన ఆరోపించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఈ పిటిషన్ సిద్ధమవుతోందని చెప్పారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కోర్టులపై చంద్రబాబు, టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను న్యాయ నిపుణులకు చూపించామన్నారు. అలాగే ఏపీ అసెంబ్లీలో సీఎంపై సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెడతామని జీవీఎల్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆయన చెప్పారు.
ఇటు హక్కుల తీర్మానం అటు కోర్టు ధిక్కార పిటిషన్‌తో చంద్రబాబును ఇరుకున పెడతామన్నారు. కాగా, ముంబై హైకోర్టులో సీఎం చంద్రబాబుపై పిల్ వేయబోతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెనాలిలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం న్యాయవ్యవస్థను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. అవినీతిని, అసమర్ధతను కప్పిపుచ్చుకొనేందుకే ప్రధాని మోదీపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 20న కాకినాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య చెప్పారు
