నేనైతే పెట్రోలు, డీజిల్ రూ. 35-40కే ఇచ్చేవాడిని
Published: Monday September 17, 2018

రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరల వల్ల మోదీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదని యోగా గురు రాందేవ్ బాబా హెచ్చరించారు. ఓ టీవీ చానల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తానే గనుక ప్రభుత్వంలో ఉంటే పెట్రోలు, డీజిల్‌ను 35-40 రూపాయలకే ఇచ్చేవాడినన్నారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
చాలా మంది ప్రజలు మోదీని విమర్శిస్తున్నారని, కానీ స్వచ్ఛ భారత్ వంటి మంచి కార్యక్రమాలను కూడా మోదీ ప్రారంభించారని చెప్పారు. అయితే వాక్‌స్వాతంత్య్రం ప్రజల ప్రాథమిక హక్కని ఆయన గుర్తు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించగా... నేనెందుకు ప్రచారం చేయాలి? అని ఎదురు ప్రశ్నించారు. తనంతట తానే రాజకీయాలకు దూరంగా వచ్చేశానన్నారు. ‘‘నేను ఏపార్టీతోనూ లేను. అన్ని పార్టీలతోనూ ఉంటా’’ అని సమాధానం ఇచ్చారు.
