విజయవాడ ఎంజీ రోడ్డులో కారు బీభత్సం
Published: Sunday September 16, 2018

విజయవాడ: నగరంలోని ఎంజీ రోడ్డులో శనివారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది. మోటార్ సైకిల్‌పై వెళుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది. దీంతో తీవ్ర గాయాలకు గురైన ఆ వ్యక్తి సెల్‌ఫోన్ ద్వారా స్నేహితులకు సమాచారమిచ్చాడు. దీంతో రాత్రి మొత్తం నగరంలో కారు కోసం తిరిగిన అతని స్నేహితులు ఎట్టకేలకు వన్‌టౌన్‌లో ఛేజ్ చేసి కారును పట్టుకున్నారు. అనంతరం కారు అద్దాలను ధ్వంసం చేసి విజయవాడ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గాయాలపాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
