పవన్ కంటే తానే గొప్ప నాయకుడిని ....
Published: Tuesday August 14, 2018

‘‘పవన్ కల్యాణ్... పవన్ అంటే గాలి. గాలి వార్తలు పోగుజేసుకుని మాట్లాడే సార్థక నామధేయుడు. గాలి కల్యాణ్ ఏదో మాట్లాడితే వాటికి సమాధానం చెప్పి నా స్థాయిని తగ్గించుకోలేను. నా సమయం వృఽథా చేసుకోలేను’’ అని రాష్ట్ర మంత్రి కె.ఎస్ జవహర్ అన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పవన్ కంటే తానే గొప్ప నాయకుడినని జవహర్ అన్నారు. దళితులు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నానని మంత్రి అన్నారు. రాజకీయాల్లో రోజా శూర్పణఖ పాత్ర పోషిస్తోందని జవహర్ విమర్శించారు. ఈడీ దర్యాప్తులో జగన్ సతీమణి భారతి పేరు ఉండటానికి, సీఎం చంద్రబాబుకు సంబంధం ఏంటో రోజానే చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎంపై రోజా చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రోజా నోటి దురుసుతో సంబంధంలేని వ్యాఖ్యలు చేసినందుకు సీఎంకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కుటుంబాన్ని బయటకు లాగింది, విజయమ్మను విశాఖలో పోటీ చేయించింది, షర్మిలతో ప్రచారం చేయించింది, భారతిని కంపెనీల్లోకి లాగింది జగన్ కాదా? అని మంత్రి ప్రశ్నించారు. జగన్ వదిలిన బాణం షర్మిళ.. ఇప్పుడు వదిలేసిన బాణంలా మిగిలిపోయారని జవహర్ ఎదేవా చేశారు. మంత్రి నారాయణ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ, తుని రైలు దగ్ధం కేసులో ఆయన మనుషులు ఉండటం వల్లే కేసులు ఎత్తేస్తామని జగన్ చెబుతున్నాడని అంటూ, అసలు ఆయన అధికారంలోకి వస్తే కదా అని మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు.
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సచివాలయంలో మాట్లాడుతూ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రజా ధనాన్ని లూటీ చేసి, స్కూల్ ఎగ్గొట్టిన పిల్లాడిలా రోడ్ల వెంట తిరుగుతూ.. శాంతి భద్రతలు పరిరక్షిస్తున్న తమను రైళ్లు తగలబెట్టించామంటూ, మతిలేని మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. అవినీతి డబ్బుతో పత్రిక, ఛానల్ పెట్టిన జగన్ ఎల్లో మీడియా అంటూ బురదజల్లుతున్నారని మంత్రి విమర్శించారు. ఎల్లో మీడియా అంటున్న జగన్‌కు ఆ పేర్లు చెప్పే దమ్ముకూడా లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
