దుబాయ్.. విమానం ఏది భాయ్.... డిమాండున్నా విశాఖ నుంచి వేయరు

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు వాణిజ్య రాజధానిగా ఉన్న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా దుబాయ్‌కి విమానాలను నడపాలన్న ప్రయత్నాలు కలగానే మిగులుతున్నాయి. ఎన్ని ప్రతిపాదనలు చేసినా బుట్టదాఖలవుతున్నాయి. విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా దుబాయ్‌కి ప్రస్తుతం ఒక విమానం నడుస్తోంది. అందులో ఉన్న 240 సీట్లలో 85 శాతం నుంచి 90శాతం వరకూ నిండుతున్నాయి. మిగిలిన వారంతా హైదరాబాద్ వచ్చి దుబాయ్‌కి వెళ్ల్లాల్సి వస్తోంది. ఇక ఐరోపా, అమెరికా దేశాలకు వెళ్లేవారు హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు. ఇలా మరో చోట దిగి వెళ్లాలంటే టిక్కెట్ ధర అధికమవడంతోపాటు అధిక సమయం తీసుకుంటుంది. నేరుగా విమానం ఉంటే ధర తగ్గుతుంది. విశాఖ నుంచి ఉన్న డిమాండును గుర్తించిన ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా విమాన సంస్థలు విశాఖ నుంచి దుబాయ్ మీదుగా విమానాలు నడిపేందుకు ఆసక్తి చూపాయి. ప్రతిపాదనలు పంపాయి. రెండు మూడేళ్లుగా ఇవి ప్రతిపాదనలుగానే ఉండిపోయాయి. దుబాయ్ విమానాశ్రయం అత్యంత రద్దీగా ఉందని, విమానాలు దిగేందుకు ఎలాంటి స్లాట్‌లు ఖాళీ లేవని పౌర విమానయానశాఖ అంటోంది. ఈ నేపథ్యంలో ఇదివరకే దుబాయ్‌కి 37కి.మీ దూరంలో ఉన్న జబిల్ అలీలోని అల్‌మక్తోమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలు నడుపుకోవచ్చని యూఏఈ హైకమిషనరు ప్రతిపాదన పెట్టారు. ఈ ప్రతిపాదనలకు అనుమతులు ఇవ్వడం లేదు. మన దేశం నుంచి కొత్త విమానాలు వేయకపోవడం, యూఏఈ నుంచి విమాన సంస్థలు ముందుకొచ్చినా ఆసక్తి చూపకపోవడం ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టడమేనని ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ (అపాటా) ఉపాధ్యక్షులు ఓ.నరేష్ కుమార్, డీఎస్ వర్మ తెలిపారు. భారత్, యూఏఈల మధ్య సీట్లు పెంచాలన్నా, విమానాలు పెంచాలన్నా ద్వైపాక్షిక నిర్ణయాల మూలంగానే సాధ్యమవుతుందని వారు అంటున్నారు. 2008-09 తర్వాత ఇరు దేశాలు భేటీ కాలేదని, దీనివల్లే అనుమతులు రావట్లేదని అంటున్నారు. దుబాయ్‌కి వెళ్లే భారత్‌కు చెందిన విమానాల్లో ప్రతి వారం 30వేల సీట్ల వరకూ మిగిలిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంట్లో ఇతర నగరాలకు కొన్ని సీట్లు తగ్గించి 2టైర్ నగరాలైన విశాఖపట్నం, విజయవాడ లాంటి నగరాలకు పంచాలని ఎంపీ హరిబాబు ఒక ప్రతిపాదన పెట్టారు. ఆయన ఇటీవల దిల్లీ వెళ్లి పౌర విమానయానశాఖ మంత్రి సురేష్ ప్రభుతో చర్చించారు. విషయం పరిశీలనలో ఉందని మంత్రి చెప్పారు.
