‘రియల్ టైం’ సీఎంకు ఇవి కనబడవా? .... పవన్ కల్యాణ్ ఫైర్
Published: Tuesday August 07, 2018

‘హత్తిబెళగల్ క్వారీ పేలుడులో 10 మంది చనిపోవడం బాధేసింది. అక్రమ పేలుళ్ల వల్లే ఈ ప్రమాదం జరిగింది. ముఖ్యమంత్రి గారూ.. ఇప్పటికైనా కళ్లు తెరవండి.. రాష్ట్రంలో అక్రమ మైనింగ్, క్వారీలను ఆపేయండి’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ పేలుడులో సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని దాస్తున్నారని.. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆలూ రు మండలం హత్తిబెళగల్ సమీపంలోని విఘ్నేశ్వర క్వారీ క్రషింగ్ యూనిట్‌లో జరిగిన పేలుడు స్థలాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. అనంతరం హత్తిబెళగల్ గ్రామాన్ని సందర్శించారు. పవన్ మాట్లాడుతూ.. ‘హత్తిబెళగల్ క్వారీలో పేలుడు జరిగి 10 మంది చనిపోతే గనుల మంత్రి ఏం చేస్తున్నారు..? మైనింగ్ అధికారులు నిద్రపోతున్నారా..? అక్రమ క్వారీపై 15 ఏళ్ల క్రితమే గ్రామస్థులు ఫిర్యాదులు చేశారు.
ఆనాడే స్పందించి ఉంటే ఈ ప్రాణనష్టం జరిగేదా’ అని నిలదీశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయం మరచిపోవద్దని, టీడీపీ నేతలను వెనకేసుకురావద్దని.. ఇప్పటికైనా కళ్లు తెరిచి అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘పసిబిడ్డలు, ఆడబిడ్డలు ఉండే ప్రదేశాలకు దగ్గరగా అనుమతులు ఎలా ఇస్తారు? అనుమతులు కొన్ని హెక్టార్లకే తీసుకుని.. ఎక్కువ విస్తీర్ణంలో తవ్వుకుంటున్నా అధికారులు నిద్రపోతున్నారా? ప్రాణాలు పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. సీఎం గారూ.. హత్తిబెళగల్, హుళేబీడు గ్రామాలకు న్యాయం చేయాలని వారి తరపున కోరుతున్నా. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడమే కాదు.. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా కర్నూలు జిల్లాలో కఠిన చర్యలు తీసుకోవాలి. హత్తిబెళగల్ క్వారీలో జరిగిన విస్ఫోటం తీవ్రత, ప్రాణనష్టం, ఆస్తినష్టం ప్రజలకు తెలియకుండా దాచాలని చూస్తున్నారు. నియమనిబంధనలు అతిక్రమించి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అక్రమ మైనింగ్ జరుగుతోంది. చంద్రబాబు రియల్‌టైమ్ గవర్నెన్స్ అంటున్నారు.. సచివాలయంలో కూర్చుని ఏ గ్రామంలో వీధి లైట్లు వెలగడం లేదో నాకు తెలిసిపోతుందని చెబుతున్నారు. ఇక్కడ అక్రమ మైనింగ్, పేలుళ్లు జరుగుతున్నా కనిపించలేదా’ అని ధ్వజమెత్తారు. అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
