మచిలీపట్నం తీర ప్రాంతంలో బోటు మునక
Published: Friday July 13, 2018

వేటకు వెళ్లి గిలకలదిండి ఫిషింగ్ హార్బర్‌కు తిరిగి వస్తున్న బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయినట్లు బోటు యజమాని మోకా నరసింహస్వామి గురువారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. గిలకలదిండికి చెందిన మోకా నరసింహ స్వామి వారం రోజుల క్రితం ఎనిమిది మంది జాలర్లతో సముద్రపు వేటకు వెళ్లాడు. దాదాపు మూడు లక్షల విలువైన చేపలను పట్టి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదాన్ని తెలుసుకున్న వెంటనే జాలర్లు హుటాహుటిన ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. మూడు లక్షల విలువైన చేపలు పడ్డాయన్న ఉత్సాహంతో తిరిగి వస్తున్న జాలర్లు సరుకులు పోగొట్టుకుని ప్రాణాలతో బయట పడ్డారు. ఈ వేటలో డ్రైవర్ నారాయణ, భాస్కరరావు, బుల్లయ్య, వేణు, రాజు, గోపాలరావు తదితరులు ఉన్నారు. ఈ బోటు ధ్వంసం కావడంతో ఏడుగురు జీవనోపాధి కోల్పోయారు.
